జాతీయ రహదారి విస్తరణలో నష్టపోయే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం

politics Telangana

రుద్రారం గ్రామస్తులతో ఎమ్మెల్యే జిఎంఆర్..

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

జాతీయ రహదారి 65 విస్తరణలో భాగంగా ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం గ్రామంలో ప్రజలకు నష్టం కలగకుండా చర్యలు చేపట్టడంతో పాటు విస్తరణలో ఆస్తులు కోల్పోయే ప్రతి ఒక్కరికి సంపూర్ణ న్యాయం చేస్తామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. అతి త్వరలో జాతీయ రహదారుల సంస్థ ఈఎన్సి ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ లతో కలిసి రుద్రారం గ్రామంలోనే సమావేశం ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. శనివారం సాయంత్రం రుద్రారం గ్రామంలోని వార్డు కార్యాలయంలో జాతీయ రహదారుల సంస్థ అధికారులు, స్థానిక కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు విస్తరణ మూలంగా తాము ఎదుర్కొనబోయే నష్టాలను వివరించారు. రోడ్డు విస్తరణ ప్రారంభించే సమయంలో ఇరువైపులా 50 ఫీట్ల చొప్పున విస్తరణ పనులు చేపడతామని చెప్పి నేడు 75 గజాలు నిర్ణయించడం సరికాదని వారు ఎమ్మెల్యే జిఎంఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీని మూలంగా గ్రామస్తులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రజల విజ్ఞప్తి మేరకు అతి త్వరలో జాతీయ రహదారుల సంస్థ ఈఎన్సి ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతి జనులకు కలిసి గ్రామ వార్డు కార్యాలయంలోనే గ్రామస్తుల సమక్షంలో సమావేశము ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చూపెడతామని హామీ ఇచ్చారు. ప్రధానంగా నష్టపోయే నిర్మాణానికి పరిహారంతో పాటు మరోచోట ప్లాట్ కేటాయింపు, మిగిలిన స్థలాలకు ప్రభుత్వ అనుమతులు ఇచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో డిఈ సందీప్, శ్రీకాంత్, సీనియర్ నాయకులు, కౌన్సిలర్ పాండు, కౌన్సిలర్లు వెంకటేష్, రాజు, సందీప్ గౌడ్, మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, సిద్ధి వినాయక దేవాలయం కమిటీ చైర్మన్ హరి ప్రసాద్ రెడ్డి, మన్నె రాజు, బలరాం, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *