మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
కొత్త పింఛన్లకు మోక్షం ఎప్పుడని నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షులు తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు 30 నెలలు పూర్తవుతున్నా, సామాజిక భద్రతా పింఛన్ల విషయంలో కొత్తగా అర్హత పొందిన వేలాది మంది నిరుపేదలు ఇంకా ఎదురుచూపుల్లోనే ఉన్నారని ఎన్నికల సమయంలో సామాజిక పింఛన్లను పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ ఇప్పటికీ అమలు కాలేదు. కనీసం కొత్తగా అర్హత పొందిన లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఆ ప్రక్రియ పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు.ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించడంతో పాటు, “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక”లో కూడా కొత్త పింఛన్ల మంజూరును ప్రస్తావించారు. అలాగే రాష్ట్ర బడ్జెట్‌లో 2 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తామని ప్రకటించారు. అనంతరం మంత్రి శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు జూన్ 2 నుంచి కొత్త పింఛన్లు అమలు చేస్తామని వెల్లడించారు. జూలై నెల ప్రారంభమైనా ఈ అంశంపై స్పష్టమైన అమలు కనిపించడం లేదని గత కొన్ని సంవత్సరాలుగా కొత్త పింఛన్ల కోసం సమర్పించిన అనేక దరఖాస్తులు మండల, మున్సిపల్ కార్యాలయాల్లో పెండింగ్‌లోనే ఉన్నాయిని అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఇతర సామాజిక భద్రత అవసరమైన లబ్ధిదారులు తమ దరఖాస్తుల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు . రాబోయే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పెండింగ్‌లో ఉన్న అర్హులైన దరఖాస్తులను పరిశీలించి, కొత్త పింఛన్లను వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
