కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందే ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు అర్జున్

politics Telangana

– ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలపడం నేరమా

– విద్యార్థులపై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే

– నిరంకుశ పాలన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

శాంతియుతంగా నిరసన ‘ఛలో పార్లమెంట్’ కార్యక్రమం చేపడుతున్న విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడం బీజేపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు అర్జున్ తీవ్రంగా ధ్వజమెత్తారు. విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించి ఢిల్లీ పోలీసులు తమ రాక్షసత్వాన్ని బయటపెట్టుకున్నారని, నిరసనకారులపై లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడమే కాకుండా రాళ్లతో దాడి చేసి కార్యక్రమాన్ని తప్పుదారి పట్టించడం కేంద్ర ప్రభుత్వ పిరికితనానికి సంకేతమని విమర్శించారు. వామపక్ష విద్యార్థి సంఘాల రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా పటాన్ చెరు కేంద్రంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్, పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలల విద్యార్థులతో కలిసి ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన తెలిపారు.ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా నిరసన తెలపడం నేరమా అని ప్రశ్నించారు.

నిరసన తెలిపే హక్కును రాజ్యాంగం కల్పించిందని, విద్యార్థులను అడ్డుకోవడం అంటే విద్యార్థుల గొంతు నొక్కడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే అవుతుందని ఆరోపించారు. ప్రజాస్వామ్య గొంతు నొక్కేసే స్వభావం నిరంకుశ పాలన లక్షణం అవుతుందే తప్ప ప్రజా ప్రభుత్వం కానేకాదని స్పష్టం చేశారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు మరియు యువకులు పరీక్ష పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యతతో రాజీనామా చేయాలని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని, అలాగే వరుస అక్రమాలకు కారణమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( ఎన్ టి ఏ ) ను రద్దు చేయాలని న్యాయమైన డిమాండ్లు కోరారని తెలిపారు. అటువంటి న్యాయమైన కోరికలు కోరిన విద్యార్థులపై దాడులు చేయడం ముమ్మాటికీ నిరంకుశ పాలనకు సంకేతమని దుయ్యబట్టారు.శాంతిభద్రతలను కాపాడాల్సిన ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాలు ఘర్షణ వాతావరణాన్ని సృష్టించాయని, పోలీసు బలగాల చర్య రౌడీజానికి నిదర్శనమని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం, పోలీసు బలగాలు విద్యార్థులపై చూపిన క్రూరత్వం తీవ్రమైన తప్పిదమని, లాఠీలు, తూటాలతో ఉద్యమాలను అణచివేయలేరని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ అనార్హుడని, ఆయన రాజకీయ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. 1 కోటి పరిహారం అందించాలని మరియు ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పటాన్ చెరు డివిజన్ కార్యదర్శి శాంసన్, పిడిఎస్ వు జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్, ఏఐఎస్ఎఫ్ నాయకులు అభిషేక్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *