నిజాయితీ, నిబద్ధత కలిగిన నిస్వార్థ నాయకుడు స్వర్గీయ జి. ఎల్లన్న: మాజీ మంత్రి హరీశ్ రావు

politics Telangana

తెల్లాపూర్ ‘జి. ఎల్లయ్య ఎన్‌క్లేవ్’లో ఎల్లన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు

పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి

ఎల్లన్న వర్ధంతి నాటికి 12 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం

మనవార్తలు ప్రతినిధి , తెల్లాపూర్ :

కార్మిక నాయకుడు, శ్రమశక్తి అవార్డు గ్రహీత, తెలంగాణ ఉద్యమకారుడు స్వర్గీయ జి. ఎల్లన్న గారి 85వ జయంతి ఉత్సవాలు తెల్లాపూర్‌లోని జి. ఎల్లయ్య ఎన్‌క్లేవ్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరై, ఎల్లన్న గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ సభలో పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎల్లన్న కుమారుడు విజయ్ ప్రతాప్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూఎల్లన్న కేవలం ఒక కార్మిక నాయకుడిగానే కాకుండా, చివరి శ్వాస వరకు నిలిచిన గొప్ప తెలంగాణ ఉద్యమ యోధుడని కొనియాడారు. బీహెచ్‌ఈఎల్ ప్రాంతంలో ఎల్లన్న పేరు తెలియని వారు, ఆయన సేవలు అందుకోని వారు ఎవరూ లేరన్నారు. ఒక సాధారణ కార్మికుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి, బీహెచ్‌ఈఎల్ ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడిగా, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మరియు జాతీయ స్థాయి ఉపాధ్యక్షుడిగా ఎదిగి కార్మికుల మన్ననలు పొందారని గుర్తుచేశారు. ఆనాడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, బాగా రెడ్డి, మల్లికార్జున్ వంటి పెద్దల సహకారంతో పోరాడి కార్మికుల కోసం ఎంఐజీ-2 కాలనీని సాధించిన అపర భగీరథుడు ఎల్లన్న అని అన్నారు.

ఉత్తర భారతదేశం నుండి వస్తున్న వారికోసం ఇక్కడి స్థానిక రిజర్వేషన్లు తొలగించినప్పుడు, నా ప్రాణం పోయినా సరే భూములు కోల్పోయిన తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు దక్కాలి అని సీఐఎస్ఎఫ్ యాజమాన్యంతో నిలబడి కొట్లాడిన గొప్ప స్థానిక పక్షపాతి ఎల్లన్న అని హరీశ్ రావు అన్నారు.1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలో డీసీఎం వ్యాన్ నుండి దూకి రెండు కాళ్లు విరిగినా, ఆసుపత్రి మంచంపై నుంచే ‘జై తెలంగాణ’ అని నినదించిన పోరాట పటిమ ఆయనదన్నారు. మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారు పిలుపునివ్వగానే అండగా నిలిచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ వాణిని బలంగా వినిపించారని గుర్తుచేశారు.తన ఆరోగ్యం, కుటుంబం గురించి కాకుండా నిరంతరం కార్మికులు, తెలంగాణ రాష్ట్రం కోసమే ఆలోచించిన నిస్వార్థ నాయకుడు కాబట్టే, ఈరోజు పార్టీలకు అతీతంగా అందరూ ఆయనను గుండెల్లో పెట్టుకున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. తెల్లాపూర్‌లోని ఈ కాలనీ ఫైనల్ లేఅవుట్ సమస్య వచ్చినప్పుడు ఎల్లన్న, మహిపాల్ రెడ్డి, సోమిరెడ్డి తన వద్దకు వచ్చారని నాటి సీఎం కేసీఆర్ గారితో రాత్రి 10 గంటలకు ఫోన్ లో మాట్లాడి కేవలం గంట వ్యవధిలో ఆర్డర్స్ తెప్పించి ‘జి. ఎల్లయ్య ఎన్‌క్లేవ్’ ఏర్పాటుకు అండగా నిలిచామని తెలిపారు.

ప్రస్తుతం ఆవిష్కరించిన విగ్రహం ఎల్లన్న గారి స్థాయికి తగినట్లుగా లేదని అభిప్రాయపడిన హరీశ్ రావు ఆయన ధోతీ కట్టుకొని, పంచెకట్టుతో సగర్వంగా నిలబడేలా 12 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కోరారు. రాబోయే రెండు నెలల్లో రానున్న ఎల్లన్న గారి వర్ధంతి నాటికల్లా ఎల్‌ఐజీ సర్కిల్‌లో గానీ, తగిన స్థలంలో గానీ ఈ 12 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించే బాధ్యతను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారికి అప్పగిస్తున్నట్లు హరీశ్ రావు ప్రకటించారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా బీహెచ్‌ఈఎల్ ఉన్నంత కాలం ఎల్లన్న గారి పేరు కార్మికుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటుందని నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *