​తెలంగాణ యాసంగి బియ్యం సేకరణ కోటాను పెంచాలి: ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

politics Telangana

మనవార్తలు ప్రతినిధి , సంగారెడ్డి :

రాష్ట్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో జరిగిన వరి ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకుని, యాసంగి (రబీ) 2025–26 మార్కెటింగ్ సీజన్‌కు గాను కేంద్ర ప్రభుత్వం సేకరించే బియ్యం కోటాను పెంచాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ​బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో, కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది వానాకాలం, యాసంగి సీజన్లలో కలిపి రికార్డు స్థాయిలో దాదాపు 152 ఎల్‌ఎమ్‌టీల వరి ఉత్పత్తి అయిందని తెలిపారు. అయితే, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కేవలం 35 ఎల్‌ఎమ్‌టీల బియ్యం (దాదాపు 51.47 ఎల్‌ఎమ్‌టీల వరి) సేకరణకు మాత్రమే అనుమతించిందని, ఇది వాస్తవ దిగుబడి కంటే చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్రంలో నిల్వ స్థలాల కొరత, మిల్లింగ్ ఆలస్యం కావడం, రవాణా ఇబ్బందులు మరియు కార్మికుల సమస్యలు తలెత్తుతున్నాయని, ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆర్థిక, నిర్వహణ భారం పడుతోందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ​గడిచిన దశాబ్ద కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కిసాన్ క్రెడిట్ కార్డ్స్, సాయిల్ హెల్త్ కార్డ్స్, డిజిటల్ అగ్రి స్టాక్ వంటి విప్లవాత్మక నిర్ణయాలతో దేశంలో రైతు సంక్షేమం ఎంతో బలోపేతమైందని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. అదే తరహాలో తెలంగాణ రైతుల ప్రయోజనాలను, వారి ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, ఎఫ్‌సిఐ ద్వారా సేకరించే బియ్యం లక్ష్యాన్ని తక్షణమే పెంచాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని, కిషన్ రెడ్డి గారి సమక్షంలో కోరారు.
​ఈ వినతిపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారని, రైతాంగానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారని అంజిరెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *