-ఎమ్మెల్సీ డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాజకీయాలకు అతీతంగా జరుపుకోవాలని ఎమ్మెల్సీ డాక్టర్ చిన్న మైల్ అంజిరెడ్డి పిలుపునిచ్చారు . సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలో బీజేపీ నేతల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 17 న తెలంగాణ విమోచనం దినోత్సవాన్ని, ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలకు బీజేపీ శ్రేణులు వాడ వాడలో ఘనంగా నిర్వహించాలన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ చిన్న మైల్ అంజిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న దేశమంతటికీ స్వాతంత్ర్యం వచ్చినా, హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వేచ్ఛ దక్కలేదనీ గుర్తు చేశారు. నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత్లో కలవడానికి నిరాకరించి, తన సొంత రాజ్యాన్ని ఏలాలనుకున్నాడని తెలిపారు. ఈ క్రమంలో కాసిం రిజ్వీ నేతృత్వంలోని రజాకార్లు గ్రామ గ్రామాన విరుచుకుపడి ప్రజలను చంపడం, ఆస్తులను దోచుకోవడం, మహిళలపై దౌర్జన్యాలు చేయడం వంటి ఘోరమైన అరాచకాలు సృష్టించారని తెలిపారు. ఈ బానిసత్వ సంకెళ్లను తెంచడానికి తెలంగాణ ప్రజలు, రైతులు తుపాకులు, తిరగలి రాళ్లు చేతబట్టి విరోచితంగా పోరాడారని గుర్తు చేశారు . భారత తొలి హోం మంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఉక్కు సంకల్పంతో తీసుకున్న ‘ఆపరేషన్ పోలో సైనిక చర్య వల్ల ఇది సాధ్యమైంది. 1948 సెప్టెంబర్ 13న మొదలైన ఈ చర్యతో సెప్టెంబర్ 17న నిజాం నవాబు భారత్కు లొంగిపోయాడు. దీనికి తోడు దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, కొమురం భీమ్ వంటి వీరుల సుదీర్ఘ పోరాటం నిజాం పునాదులను కదిలించిందన్నారు .
సెప్టెంబర్ 17ను దశాబ్దాలుగా ఓటు బ్యాంకు రాజకీయం కోసమే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విలీన దినం అని దాటవేసాయని బీజేపీ ఆరోపిస్తోంది. ఇది కేవలం విలీనం కాదని, నిజాం రాచరికం నుంచి స్వేచ్ఛ పొందిన విమోచన దినోత్సవం అని, అమరవీరుల త్యాగాలకు సరైన గౌరవం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించాలని బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్తోంది. గ్రామాలలో మండలాలలో బిజెపి కార్యకర్తలు ప్రజలతో కలిసి సెప్టెంబర్ 17 జెండా ఆవిష్కరణ , భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, సంగారెడ్డి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కొల్కురి రాజశేఖర్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు ఆర్విఎస్ రవి, ఆనంద్ రెడ్డి, మురళీధర్ వర్మ, కృష్ణమూర్తి చారి, కొండా లక్ష్మణ్ గుప్తా , ప్రతాప్ రెడ్డి, జగన్ రెడ్డి, నర్సింగ్ రావు, సంధ్యారాణి, ప్రసాద్ యాదవ్, బీజేపీ నాయకులు, బీజేవైఎం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
