గీతం ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన హైదరాబాద్ వర్సిటీ ప్రొఫెసర్ అజైలియు నియుమై
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
పేదరికం, నిరుద్యోగం, లింగ అసమానత, సామాజిక వివక్షలను మానవ అక్రమ రవాణాకు ప్రధాన కారణాలుగా హైదరాబాదు విశ్వవిద్యాలయం, సోషియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అజైలియు నియుమై అన్నారు. హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్) ఆధ్వర్యంలో ‘భారతదేశంలో మానవ అక్రమ రవాణాపై అంతర్ విభాగ పరిశోధన ఎదుర్కొంటున్న సవాళ్లు’ అనే అంశంపై మంగళవారం ఆమె ఆతిథ్య ఉపన్యాసం చేశారు.జీఎస్ హెచ్ఎస్ డీన్ డాక్టర్ రథిన్ రాయ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ నియుమై మాట్లాడుతూ, మానవ అక్రమ రవాణా యొక్క సంక్లిష్టమైన, బహుముఖ స్వభావాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. దీనిని ఒకే విజ్జాన శాస్త్ర దృక్కోణంతో అర్థం చేసుకోలేమని ఆమె స్పష్టీకరించారు. అక్రమ రవాణాకు ఆర్థిక, రాజకీయ, చారిత్రక, సాంస్కృతిక అంశాలలో మూలాలు ఉన్నాయని, అందువల్ల దీనికి సోషియాలజీ, చట్టం, ప్రజా విధానం, అర్థశాస్త్రం, ప్రజారోగ్యం, సాంకేతికతతో కూడిన అంతర్ విభాగ పరిశోధన విధానం అవసరమని చెప్పారు.

అక్రమ రవాణా కేసులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ, శిక్షా రేట్లు తక్కువగా ఉన్నాయని, దీనివల్ల చాలా మంది నేరస్థులు శిక్ష నుంచి తప్పించుకుంటున్నారని డాక్టర్ నియుమై అన్నారు. ఆధునిక బానిసత్వాన్ని పోలిన రూపాలలో మానవ అక్రమ రవాణా కొనసాగుతూనే ఉందన్నారు. వ్యవస్థీకృత నేర నెట్ వర్కులు ఈ రంగంలో పరిశోధనను ప్రత్యేకంగా సవాలుగా మారుస్తున్నాయని విచారం వెలిబుచ్చారు. అర్థవంతమైన క్షేత్రస్థాయి పని కోసం బాధితులతో నమ్మకాన్ని పెంచుకోవడం చాలా అవసరమని, అదే సమయంలో వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో, బాధితులకు మద్దతు ఇవ్వడంలో సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ చేసిన కృషిని డాక్టర్ నియుమై ప్రత్యేకంగా గుర్తిస్తూ, ప్రజ్వల, చైతన్య మహిళా మండలి, మై ఛాయిసెస్ ఫౌండేషన్ వంటి సంస్థల సహకారాన్ని ఆమె ప్రశంసించారు.
అక్రమ రవాణాను అరికట్టడానికి బలహీన వర్గాల కోసం పటిష్టమైన విధానాలు, పునరావాస చర్యలు, ఆర్థిక సహాయం అవసరమని డాక్టర్ నియుమై నొక్కి చెప్పారు. బాధితులు సమాజంలో తిరిగి కలిసిపోవడంలో ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. సామాజిక కళంకం తరచుగా తిరిగి అక్రమ రవాణాకు దారితీస్తుందని ఆమె ఆందోళన వెలిబుచ్చారు.విద్యార్థుల ప్రశ్నలకు డాక్టర్ నియుమై జవాబిస్తూ, విధాన రూపకర్తలకు సమాచారం అందించడం, భారతదేశాన్ని మానవ అక్రమ రవాణా రహితంగా మార్చడానికి సమర్థవంతమైన వ్యూహాలను అభివృద్ధి చేయడంలో తోడ్పడటమే తన పరిశోధన అంతిమ లక్ష్యమని అన్నారు. మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ వ్యాపారం తరువాత ప్రపంచంలో అత్యంత లాభదాయకమైన వ్యవస్థీకృత నేరాలలో మానవ అక్రమ రవాణా ఒకటి ఆమె అభివర్ణించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాలు, పరిశోధకులు, చట్ట అమలు సంస్థలు, పౌర సమాజం సమన్వయంతో చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను ఆమె వివరించారు.తొలుత, సోషియాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సాకిబ్ ఖాన్ అతిథిని స్వాగతించగా, అదే విభాగం అధ్యాపకురాలు డాక్టర్ రోమా భట్టాచార్య వందన సమర్పణ చేశారు.
