మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:
హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం. కెజియా ఎలిజబెత్ డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘హరిత పద్ధతిలో సంశ్లేషించిన మెటల్ సల్పైడ్ నానోపార్టికల్స్, వ్యవసాయం, మురుగునీటి శుద్ధి, సూక్ష్మజీవనాశక చర్యలో వాటి అనువర్తనాల’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ జీవ (పర్యావరణ) శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రంధి ఉమాదేవి ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.ఎలిజబెత్ చేసిన డాక్టరల్ పరిశోధన, మొక్కల ఆధారిత పదార్థాలను ఉపయోగించి మెగ్నీషియం సల్ఫైడ్ (MgS) ఫెర్రస్ సల్ఫైడ్ (FeS) నానోపార్టికల్ప్ యొక్క పర్యావరణ అనుకూల సంశ్లేషణను అన్వేషించిందని తెలియజేశారు. ఈ సంశ్లేషణ చేసిన నానోపార్టికల్స్ విత్తన అంకురోత్పత్తిని పెంచడంలో, రోడమైన్ బి డైని విచ్ఛిన్నం చేయడంలో, సూక్ష్మజీవనాశక వ్యాధికారకాలను ఎదుర్కోవడంలో ఆశాజనకమైన సామర్థ్యాన్ని ప్రదర్శించాయన్నారు.వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడానికి, రంగులతో కలుషితమైన మురుగునీటిని శుద్ధి చేయడానికి, సూక్ష్మజీవుల సవాళ్లను పరిష్కరించడానికి పర్యావరణ అనుకూల పద్ధతిలో సంశ్లేషణ చేసిన నానోకణాలు సుస్థిర పరిష్కారాలుగా ఉపయోగపడతాయని, తద్వారా హరిత నానోటెక్నాలజీ పురోగతికి దోహదపడతాయని ఈ అధ్యయనం నిరూపించిందని వివరించారు.డాక్టర్ ఎలిజబెత్ సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం.రెజా, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు ఈ పరిశోధనలో ఆమె చేసి గణనీయమై కృషిని అభినందించినట్టు తెలిపారు. డాక్టరేట్ పరిశోధన అంతటా అంకితభావంతో మార్గనిర్దేశనం చేయడంతో పాటు సలహాలు అందించినందుకు డాక్టర్ ఉమాదేవిని కూడా ప్రశంసించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
