మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :
హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి సయ్యదా ఇమ్రానా ఫాతిమా ఖవాజా జకియుల్లా ఖ్వాద్రి డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘సురక్షిత చిత్ర స్టెగానోగ్రఫీ కోసం ఒక ఉత్పాదక ప్రతికూల నెట్ వర్క్’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి. యుగంధర్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.వినూత్న డీప్ లెర్నింగ్ పద్ధతుల ద్వారా సురక్షిత డేటా ప్రసారాన్ని మెరుగుపరచడంపై ఈ అధ్యయనం దృష్టి సారించినట్టు తెలియజేశారు. ప్రస్తుత స్టెగానోగ్రాఫిక్ పద్ధతులలోని కీలక పరిమితులను పరిష్కరిస్తూ, శిక్షణ స్థిరత్వాన్ని పెంచే, ఎంబెడింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరిచే, దాగి ఉన్న సమాచారాన్ని విశ్వసనీయంగా వెలికితీసేలా చూసే పటిష్టమైన GAN-ఆధారిత ఫ్రేమ్ వర్కుల శ్రేణిని ఈ అధ్యయనం ప్రతిపాదిస్తుందని వివరించారు.
గేమ్ థియరీ, డీప్ కన్వల్యూషనల్ నెట్ వర్కులు, సైకిల్ కన్సిస్టెన్సీ లెర్నింగ్, ఆప్టిమైజేషన్ వ్యూహాలను ఏకీకృతం చేయడం ద్వారా, ఈ పరిశోధన ఇమేజ్ స్టెగానోగ్రఫీ సిస్టమ్ ల భద్రతను, గుర్తించలేనితనాన్ని, ప్రతికూల దాడులు, డేటా నష్టానికి వ్యతిరేకంగా వాటి స్థితిస్థాపకతను గణనీయంగా బలపరుస్తుందని పేర్కొన్నారు.సాంప్రదాయ పద్ధతులతో పోలిస్తే మెరుగైన దృశ్య నాణ్యత, గుర్తింపును నిరోధించే పటిష్టత, సురక్షితమైన డేటా పునరుద్ధరణ వంటివి ఈ పరిశోధన ఫలితాలలో కనబడుతున్నాయన్నారు. ఇవి మరింత సురక్షితమైన, విశ్వసనీయమైన డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థలకు దోహదపడతాయని తెలిపారు.
డాక్టర్ సయ్యదా ఇమ్రానా ఫాతిమా సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ షేక్ మహబూబ్ బాషా, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
