ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

politics Telangana

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత

బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు

ప్రతి కాలనీలో పచ్చదనం పారిశుధ్యానికి పెద్దపీట

ప్రతిరోజు సాయంత్రం నుండి తెల్లవారుజాము వరకు వీధి దీపాలు వెలగాల్సిందే

అనధికార హోర్డింగులు తక్షణమే తొలగించండి

అమీన్పూర్, పటాన్‌చెరు బల్దియా సర్కిల్ అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

నూతనంగా ఏర్పాటైన పటాన్‌చెరు మరియు అమీన్పూర్ జిహెచ్ఎంసి సర్కిళ్ల పరిధిలోని ప్రతి కాలనీలో విద్యుత్, మంచి నీరు, పారిశుద్ధ్యం అంశాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని.. ఇందుకు అనుగుణంగా ఆయా శాఖల ఉన్నతాధికారులు ప్రతి రోజు క్షేత్రస్థాయిలో పర్యటించాలని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు.బుధవారం సాయంత్రం పటాన్‌చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలోపటాన్‌చెరు, అమీన్పూర్ సర్కిల్ బల్దియా అధికారులు, హెచ్ఎండబ్ల్యూఎస్, విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు సర్కిల్ల పరిధిలో గల తెల్లాపూర్, ముత్తంగి, పటాన్‌చెరు, జెపి కాలనీ, అమీన్పూర్, బీరంగూడ, రామచంద్రాపురం, భారతి నగర్, బొల్లారం డివిజన్లో పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు.

రాబోయే వేసవి కాలానికి అనుగుణంగా రెండు సర్కిళ్ల పరిధిలోని ప్రతి కాలనీకి మంచినీరు ఇబ్బంది లేకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. నూతన కాలనీలకు సైతం స్వచ్ఛ జలాలు అందించేలా కొత్త పైపు లైన్ నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు.విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ కోతలు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. లో ఓల్టేజ్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన పక్షంలో నూతన సబ్స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని.. ప్రభుత్వంతో చర్చించి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.పచ్చదనం పారిశుద్ధ్య అంశంపై ప్రజల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని.. సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతి కాలనీలో తప్పనిసరిగా రోడ్లు శుభ్రపరచడంతో పాటు విధిగా చెత్తను సేకరించేలా చూడాలని కోరారు.

ప్రభుత్వ అనుమతి లేకుండా ఏర్పాటుచేసిన హోర్డింగులను తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించారు. రేపటి నుండి ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభించాలని సూచించారు.ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించినప్పుడే నిజమైన ప్రజాపాలన అందించినట్లు అవుతుందని అన్నారు.ప్రభుత్వం అందించే నిధులతో పాటు సిఎస్ఆర్ నిధులు సైతం కేటాయించి అభివృద్ధిని పరుగులు పెట్టిద్దామని అన్నారు.ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు ప్రదీప్ కుమార్, జ్యోతి రెడ్డి, హెచ్ఎండబ్ల్యూఎస్ జిఎం శ్రీనివాస్, విద్యుత్ శాఖ డీఈ భాస్కరరావు, తహసిల్దార్లు వెంకటేష్, సరస్వతి, శానిటేషన్ డిఈ కృష్ణవేణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *