అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు
పూర్తి పారదర్శకతతో సర్వే
పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :
నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేస్తున్న క్రమంలో ఎవరైనా ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యుల పేరుతో ఇల్లు, స్థలాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరొందిన పటాన్ చెరు నియోజకవర్గంలో అత్యధిక శాతం పేద, మధ్యతరగతి ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గ పరిధిలోని వేల మంది పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అందజేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సొంత స్థలము ఉంటే ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం, స్థలం లేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయిస్తోందని తెలిపారు. పూర్తి పారదర్శకతతో అర్హులైన ప్రతి ఒక్కరికి వీటిని అందించేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఇటీవల ఇందిరమ్మ కమిటీ సభ్యుల పేరుతో కొందరు వ్యక్తులు పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాలు, పట్టణాలు, డివిజన్లలో తిరుగుతూ ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామంటూ వేల రూపాయలు వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించాలని గృహ నిర్మాణ శాఖ జిల్లా పీడీ చలపతిరావు ను ఆదేశించారు. ఈ అంశంపైన వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. అక్రమార్కులకు అధికారులు సహకరిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్పూర్, పటాన్ చెరు సర్కిళ్ల పరిధిలో సర్వే జరుగుతుందని అతి త్వరలో అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో డిఈ సుజాత, ఏఈ లు పాల్గొన్నారు.
