మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
రైతులు, వ్యాపారులు, వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రణాళికతో మార్కెట్ యార్డు అభివృద్ధి పనులు చేపడుతున్నామని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం తెలిపారు.గురువారం పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మార్కెట్ కమిటీ చైర్మన్ స్వయంగా పరిశీలించారు. అనంతరం ఏపూరి శివానందం మాట్లాడుతూప్రస్తుతం 13 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 172 దుకాణాల నిర్మాణం శరవేగంగా కొనసాగుతోందని తెలిపారు. పనులు పూర్తయ్యాక లైసెన్స్ కలిగిన వ్యాపారులకు దుకాణాలను కేటాయించడంతో పాటు కొత్త వ్యాపారులకు కూడా లైసెన్సులు మంజూరు చేసి వ్యాపార విస్తరణకు అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ యార్డును తెలంగాణలోనే అత్యుత్తమ, ఆదర్శవంతమైన మార్కెట్‌గా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.మార్కెట్ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని, నిర్మాణ పనులను నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేసేలా అధికారులు, కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధికారులు, సిబ్బంది, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.
