పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో కదం తొక్కిన పటాన్చెరుఆటో కార్మికులు
వేలాది ఆటోలతో భారీ నిరసన ర్యాలీ.. బిహెచ్ఇఎల్ నుంచి ఇస్నాపూర్ వరకు హోరెత్తిన నినాదాలు..
హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఆటో కార్మికుడికి ఏడాదికి రూ. 12,000 చొప్పున వెంటనే ఆర్థిక సాయం చేయాలని డిమాండ్..
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఆటో కార్మికులను మోసం చేస్తోందని నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ పోరు బాటలో భాగంగా ఆదివారం ఉదయం పటాన్చెరు నియోజకవర్గ ఆటో కార్మికులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో చేపట్టిన ఈ ర్యాలీకి వేలాది మంది ఆటో కార్మికులు, భారీ సంఖ్యలో ఆటోలతో తరలివచ్చారు.బిహెచ్ఇఎల్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ అశోక్ నగర్, బీరంగూడ, రామచంద్రాపురం, పటాన్చెరు, ముత్తంగి మీదుగా ఇస్నాపూర్ వరకు సాగింది. ఆటో కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
హామీలు తక్షణమే అమలు చేయాలి
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆటో కార్మికులకు ప్రకటించిన సంవత్సరానికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం హామీని వెంటనే అమలు చేయాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తర్వాత వాటి అమలును విస్మరించిందని ఆయన విమర్శించారు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని నాయకులు స్పష్టం చేశారు. కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం అవసరమైతే మరిన్ని ఉద్యమాలు చేపడతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కో-ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఆటో యూనియన్ ప్రతినిధులు, వేలాది మంది ఆటో కార్మికులు పాల్గొన్నారు.
