మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
రుద్రారం పెద్ద చెరువులో చేపల మృతికి కారణమైన పరిశ్రమల యాజమాన్యాల పైన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పటాన్ చెరు మండలంలోని రుద్రారం పెద్ద చెరువులో చేపల మృతికి కారణమైన పరిశ్రమల యాజమాన్యాల పైన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ పటాన్ చెరు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ రుద్రారం పెద్ద చెరువు ఆయకట్టు గతంలో 250 ఎకరాలకు ఉండేదని, ప్రస్తుతం గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రుద్రారం పెద్ద చెరువులో పాశం మైలారం, రుద్రారం లోని ఎంఎస్ఎన్ పరిశ్రమల నుంచి వచ్చే జల కాలుష్యo వలన పూర్తిగా చెరువు కలుషిత జలాలతో నిండిపోయిందని ఆరోపించారు. చెరువులో ఉన్న చేపలు కలుషిత జలాలతో దాదాపు 2000 చేపలు గత రెండు రోజుల్లో చనిపోయాయని, నాలుగు నుంచి ఐదు కేజీల బరువున్న చేపలు, ఇస్నాపూర్ సండే మార్కెట్లో అనేకమంది విక్రయించారని అన్నారు. చేపలు కొన్న అనేకమంది అనేక రోగాల బారిన పడే అవకాశం ఉందన్నారు. గ్రామంలోని మత్స్యకారుల కుటుంబాలు చేపలు చనిపోవడంతో ఆందోళనకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద చెరువు నీటిని కలుషితం చేస్తున్న ఎంఎస్ఎన్, హైదరాబాద్ కెమికల్స్, సిరిలియో, అరబిందో ఫార్మా పరిశ్రమల యాజమాన్యాల పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో రుద్రారం పెద్ద చెరువులో బర్రెలు, మేకలు చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. ఇట్టి విషయంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అందుకోసం రుద్రారం పెద్ద చెరువులో మృతి చెందిన చేపల సంఘటనలో విచారణ జరిపించి, కలుషిత జలాలను విడుదల చేస్తున్న పరిశ్రమల యాజమాన్యాలను కఠినంగా శిక్షించాలని, లేనిపక్షంలో ఆందోళన మరింత తీవ్రతలను చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ ,వెంకటేష్, దత్తు లు పాల్గొన్నారు.
