మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు, (సెప్టెంబర్ 5, 2026) :
ప్రతి ఒక్కరి జీవితంలో తన తల్లే తొలి గురువు” అని అన్నారు. తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తారని ఎస్హెచ్ఓ శ్రీ ఎం. రవీందర్ అన్నారు .ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, పటాన్చెరు పోలీసులు పటాన్చెరు పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు ఉపాధ్యాయులను సన్మానించి, విద్యార్థులకు విద్యాబోధన చేయడంతో పాటు సమాజానికి మంచి పౌరులను అందించడంలో వారు చేస్తున్న విశిష్ట సేవలను అభినందిస్తూ, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఐ మాట్లాడుతూ విద్యార్థులు సోషల్ మీడియా మరియు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఎటువంటి బెదిరింపులు, వేధింపులు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు ఎదురైనా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో భద్రతపై అవగాహన పెంపొందించడం, పోలీసులు–ప్రజల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేయడం, అలాగే యువతతో పోలీసు శాఖకు సానుకూలమైన మరియు బాధ్యతాయుతమైన సంబంధాన్ని ఏర్పరచడం ప్రధాన లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ (అడ్మిన్) శ్రీ ఎం. మహేశ్వర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ వీరమణి పాల్గొన్నారు .
