నియోజకవర్గస్థాయి ప్రభుత్వ శాఖల అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం

politics Telangana

తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ అంశాలకు ప్రథమ ప్రాధాన్యత

నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించండి

ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించవద్దు

ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే భూములు సేకరించాలి

గ్రామ కంఠాల పరిధిలోని ఇండ్ల నిర్మాణ అనుమతుల్లో సాంకేతిక ఇబ్బందులు తొలగించండి

అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి..

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

ప్రజలకు అత్యంత ఆవశ్యకమైన తాగునీరు సరఫరా, నిరంతర విద్యుత్ పంపిణీ, పారిశుధ్యం అంశంలో అలసత్వం వహించవద్దని.. నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పర్యవేక్షించాలని ఆయా శాఖల ఉన్నత అధికారులకు ఎమ్మెల్యే జిఎంఆర్ సూచించారు.సోమవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో అమీన్పూర్, పటాన్‌చెరు బల్దియా డిప్యూటీ కమిషనర్లు, ఆయా మండలాల తహసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ చైర్మన్లు, విద్యుత్, నీటిపారుదల, పిసిబి, జాతీయ రహదారులు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదల, జలమండలి, పరిశ్రమలు, టౌన్ ప్లానింగ్ శాఖల అధికారులతో వివిధ అంశాలపై ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వేసవికాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు, నిర్దేశించిన సమయంలో తాగునీరు పంపిణీ చేయాలని సూచించారు. లో వోల్టేజి సమస్యలు తలెత్తకుండా విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా నూతన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.ఐదు మున్సిపాలిటీలకు మంజూరైన 75 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు అతి త్వరలో శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు.

జిహెచ్ఎంసి పరిధిలోని 9 డివిజన్ల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని సూచించారు. నూతన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వంతో చర్చించి మరిన్ని నిధులు కేటాయించబోతున్నట్లు తెలిపారు. అమీన్పూర్ పరిధిలో 23 కోట్ల రూపాయలతో 55 పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. నూతన కాలనీలకు సైతం మంచినీటిని పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని జలమండలి జిఎం శ్రీనివాస్ కు సూచించారు. నూతన పైపులైన్ల ఏర్పాటు కోసం నిధులు కేటాయించాలని ఇప్పటికే జలమండలి ఎండి అశోక్ రెడ్డికి సైతం విన్నవించడం జరిగిందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మంచినీటి పంపిణీ అంశంలో జాప్యం జరగకూడదని ఆదేశించారు. బల్దియా పరిధిలోని పార్కుల సుందరీకరణ కోసం 10 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని సంబంధిత అధికారులు తెలిపారు.

అభివృద్ధి పనుల అంశంలో విద్యుత్, జలమండలి, ఇంజనీరింగ్ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శరవేగంగా జరుగుతున్న పట్టణీకరణ మూలంగా ప్రభుత్వ భూముల లభ్యత అత్యంత ఆవశ్యకమని.. ప్రజా ప్రతినిధులు, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములను పరిశ్రమలకు కేటాయించాలని రెవెన్యూ అధికారులను ఎమ్మెల్యే జిఎంఆర్ ను కోరారు. ఇందుకు భిన్నంగా పరిశ్రమల పేరుతో ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్, పరిశ్రమలకు కేటాయిస్తే ప్రజా ఉద్యమాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. జిన్నారం మున్సిపల్ పరిధిలోని నల్తూరులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులు కొనసాగుతున్నాయని అతి త్వరలో శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు.

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 993 సర్వే నెంబర్ లో నవోదయ పాఠశాల ఏర్పాటు కోసం భూమి కేటాయింపు జరిగిందని, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. ఇదే సర్వే నంబర్ లో ఎస్టిపి కోసం కేటాయించిన 10 ఎకరాల భూమిని ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా రద్దు చేయాలని కలెక్టర్ ని కోరనున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించకూడదని.. నిధుల కొరత ఉంటే తనను నేరుగా సంప్రదించాలని కోరారు. పటాన్చెరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *