ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
భౌతికశాస్త్ర ఉపాధ్యాయులను నాణ్యమైన శిక్షణతో ప్రోత్సహించి, ఆ రంగాన్ని అభివృద్ధి చేయాలనే విద్యాపరమైన బాధ్యతగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు స్పష్టీకరించారు. ‘అధునాతన భావనలు, బోధనా పద్ధతులు, విద్యా సాధనాలు’ అనే అంశంపై నిర్వహిస్తున్న మూడు రోజుల భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల వృత్తి వికాస కార్యక్రమం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఇండియన్ ఫిజిక్స్ అసోసియేషన్ (ఐపీఏ) విశాఖపట్నం విభాగం సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, భౌతికశాస్త్ర రంగంలోని ప్రముఖ నిపుణుల నుంచి అధునాతన భావనలు, ఆచరణాత్మక అనువర్తనాలను నేర్చుకోవడానికి లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.మూడు రోజుల కార్యక్రమ స్వరూపాన్ని గీతం విశిష్ట ఆచార్యుడు ప్రొఫెసర్ బి.వి.ఆర్. టాటా వివరిస్తూ, ఉదయం సైద్ధాంతిక చర్చలు, భోజనానంతరం ఆచరణాత్మక శిక్షణ ఉండేలా ఈ కార్యక్రమాలను రూపొందించామని తెలిపారు. పలువురు విద్యా నిపుణులు తమ జ్జానం, అనుభవాలను పంచుకుంటారని చెప్పారు.

గీతం సైన్స్ డీన్ ప్రొఫెసర్ అనంత రామకృష్ణ మాట్లాడుతూ, భౌతికశాస్త్రం అత్యంత ఆకర్షణీయమైన విషయాలలో ఒకటని, అంతిమ జ్జానానికి పునాదిగా అభివర్ణించారు. సైన్స్ ఆర్థిక విజయానికి దారితీయదనే (టెకీల వలె బాగా సంపాదించలేము) సాధారణ అపోహను ప్రస్తావిస్తూ, శాస్త్రీయ జ్జానం ద్వారా ఆర్థిక విలువను సృష్టించడంలో పేటెంట్ చట్టాలు, ఆవిష్కరణలు, ఉత్పత్తి అభివృద్ధి యొక్క ప్రాముఖ్యత ఆయన వివరించారు. విద్యార్థులు సైన్స్ విద్యను ఆర్థికంగా అర్థవంతంగా మార్చాల్సిన అవసరాన్ని ఆయన ఉద్ఘాటించారు. అనంతరం, ఇందులో పాల్గొంటున్న వారిలో ఉత్సుకతను రేకెత్తించేందుకు, శాస్త్రీయ ఆవిష్కరణలో ముడిపడి ఉన్న ఆచరణాత్మక సమస్యలు, పారిశ్రామిక అనువర్తనాలు, ఆర్థిక విలువను ప్రదర్శిస్తూ, ‘విద్యుదయస్కాంతత్వం: కొన్ని నిజ జీవిత అనువర్తనాలు’ అనే అంశంపై ఆయన తొలి సాంకేతిక కార్యక్రమాన్ని నిర్వహించారు.
గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లో అందుబాటులో ఉన్న విద్య, పరిశోధనా సౌకర్యాలను డైరెక్టర్ డాక్టర్ ఎం.రెజా పరిచయం చేశారు. ముఖ్యంగా, అంతర్విభాగ పరిశోధనకు కేంద్రంగా పనిచేసే మల్టీడిసిప్లినరీ యూనిట్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ (MURTI) ల్యాబ్స్ ను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. గీతం హైదరాబాదు ప్రాంగణంలోని అధునాతన ప్రయోగశాలలను సందర్శించాలని ఈ శిక్షణలో పాల్గొంటున్న వారందరినీ ఆయన ఆహ్వానించారు.ఐఐటీ మద్రాసు భౌతికశాస్త్ర విభాగం నుంచి పదవీ విరమణ చేసిన ఆచార్య నటరాజన్, గీతం విశిష్ట ఆచా ర్యుడు, సెంటర్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ కు చెందిన ప్రొఫెసర్ జి.రవికుమార్ తన అనుభవాన్ని పంచుకున్నారు. మంగళవారం (రెండవ రోజున) ఐఐఎస్సీ బెంగళూరు భౌతికశాస్త్ర విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ ఆచార్య విభోర్ సింగ్, భాభా అణు పరిశోధనా సంస్థ (బార్క్) పూర్వ శాస్త్రవేత్త జి.ఏ.రామారావు ఉపన్యసించనున్నారు. మరో రెండు రోజుల పాటు కొనసాగనున్న ఈ శిక్షణా కార్యక్రమాన్ని డాక్టర్ జి.సాయిప్రీతి, డాక్టర్ టి.విశ్వం సమన్వయం చేస్తున్నారు.
