మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు :
పరిశ్రమకు సంబంధించిన జ్జానాన్ని, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే నైపుణ్యాలను విద్యార్థులకు అందించడానికి ‘ఫ్యూచర్ ఎక్స్5’ పేరిట ఒక చైతన్యవంతమైన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల శ్రేణికి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం శ్రీకారం చుట్టింది. గీతంలోని శిక్షణ, మార్గదర్శకత్వం, వృత్తి మార్గదర్శకత్వ డైరెక్టరేట్ (టీఎంసీజీ)లోని శిక్షణ, సామర్థ్య వికాస (టీసీడీ) విభాగం దీనిని ఏర్పాటు చేస్తున్నటు డైరెక్టర్ డాక్టర్ రోజీనా మాథ్యూ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ, ప్రాజెక్టు మేనేజ్ మెంట్, క్వాంటం కంప్యూటింగ్, కార్పొరేట్ రెడీనెస్, ఎథికల్ హ్యాకింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల నుంచి అనుభవజ్జులైన నిపుణులను తీసుకురావడం ద్వారా విద్య, పరిశ్రమ అంచనాల మధ్య అంతరాన్ని తగ్గించడమే ఈ కార్యక్రమ లక్ష్యంగా డాక్టర్ రోజీనా వివరించారు.
మే 23 నుంచి జూన్ 6 వరకు నిర్వహించనున్న ఈ సెషన్లు, ప్రతివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై ఆచరణాత్మక అవగాహన పొందడం, ప్రముఖ సంస్థల నిపుణులతో సంభాషించడం, ప్రస్తుత మార్కెట్ పోకడలను అర్థం చేసుకోవడం, వారి వృత్తిపరమైన, కెరీర్ సంసిద్ధతను మెరుగుపరచుకోవడం వంటివి చేస్తారని డాక్టర్ రోజీనా తెలిపారు.
మే 23న వినియోగదారు సంబంధాల నిర్వహణ (సీఆర్ఎం), ప్రాజెక్టు నిర్వహణలను విల్ కామ్ డెలివరీ మేనేజర్ శశిధర్ కొండూరి పరిచయం చేస్తారన్నారు. మే 30న క్వాంటం కంప్యూటింగ్, భద్రతను ఈవై డైరెక్టర్ మూర్తి పరవశివం వివరిస్తారని తెలిపారు. మే 31న కార్పొరేట్ సంస్కృతిని అర్థం చేసుకోవడం, ఇంటర్వ్యూ నైపుణ్యాలు, ఉత్పాదకత, స్వీయ బ్రాండింగ్ లపై ఎంఎక్స్4 భాగస్వామి, మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ గురుసిద్ధయ్య శిక్షణ ఇస్తారన్నారు. జూన్ 6న నైతిక హ్యాకింగ్ ను లిబరల్ సెక్యూరిటీ వ్యవస్థాపకులు సుజయ్ గంకిడి పరిచయం చేస్తారని డైరెక్టర్ వివరించారు.
పరిశ్రమ భవిష్యత్తు పోకడలను అన్వేషించడానికి, వృత్తిపరమైన సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడానికి, అభివృద్ధి చెందుతున్న కెరీర్ రంగాలకు తమను తాము సిద్ధం చేసుకోవడానికి ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, ఆయా సెషన్లలో చురుకుగా పాల్గొనాలని డాక్టర్ రోజీనా మాథ్యూ సూచించారు.
