ధాన్యం కొనుగోళ్ళను వెంటనే చేపట్టాలి
హమాలీలు, లారీల కొరత నివారించాలి
జిన్నారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్
మనవార్తలు ప్రతినిధి ,జిన్నారం :
రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వర్షాకాలం ఆరంభమయ్యే సమయం ఆసన్నమైనప్పటికీ ధాన్యం కొనుగోలు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తుందని. అన్నం పెట్టే రైతన్న కంట కన్నీరు ప్రభుత్వానికి మంచిది కాదని వెంటనే కొనుగోళ్ళు ప్రారంభించాలని పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం జిన్నారం, సోలక్పల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యపు కొనుగోలు కేంద్రాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్ల అంశంలో ఎదుర్కొంటున్న సమస్యలను రైతులు ఎమ్మెల్యే జిఎంఆర్ కు వివరించారు. కష్టనష్టాలను ఎదుర్కొని ధాన్యం పండించి కొనుగోలు కేంద్రాలకు తీసుకొని వస్తే.. అధికారుల నిర్లక్ష్యం మూలంగా గత 15 రోజులుగా కొనుగోలు చేయకపోవడం మూలంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు కన్నీటి పర్యంతమయ్యారు. వర్షాలు ఎప్పుడు వస్తాయన్న భయాందోళనతో ప్రతిరోజు ధాన్యాన్ని కాపాడుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గత పది సంవత్సరాల పాటు రాష్ట్రంలోని రైతాంగానికి స్వర్ణయుగం నడిచిందని అన్నారు. రైతుకి రైతుబంధు, రైతు భీమా, సాగునీరు, పండించిన ప్రతి పంటకు మద్దతు ధర, సకాలంలో కొనుగోళ్లు చేయడంతో పాటు వెంటనే డబ్బులు సైతం డిపాజిట్ చేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు.పటాన్‌చెరు నియోజకవర్గంలో వ్యవసాయం అంతంత మాత్రమే ఉందని పండించిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
మరో వారం రోజుల్లో రుతుపవనాలు ప్రారంభమయ్యే సమయం ఆసన్నమైనప్పటికిని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యపు రాశులు అలాగే ఉండడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అర్థం పడుతుందని అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న కంట కన్నీరు ప్రభుత్వానికి మంచిది కాదని ప్రభుత్వానికి సూచించారు. రవాణా, హమాలీలు, గన్ని బ్యాగుల కొరత పేరుతో రైతులను ఇబ్బందులకు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ రోజు నుండే ధాన్య కొనుగోలు చేపట్టాలని జిల్లా పౌరసరఫల శాఖ అధికారికి ఫోన్ లో సూచించారు. రాబోయే రెండు రోజుల్లో నియోజకవర్గంలో రైతు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేయడంతోపాటు ఇందుకు సంబంధించిన డబ్బులు సైతం డిపాజిట్ చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు. లేనిపక్షంలో రైతుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
