ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస వేతనాలకు శాస్త్రీయత ఎక్కడ..?
72 షెడ్యూల్ పరిశ్రమల కనీస వేతనాల ఊసేది
సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు :
కార్మికుల కనీస వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా రూ. 26వేలకు పెంచాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన కనీస వేతనాలకు శాస్త్రీయ బద్ధంగా లేదని, 72 షెడ్యూల్ పరిశ్రమల కార్మికుల కనీస వేతనాల ఊసే లేదని సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. శనివారం పాశమైలారం ఇండస్ట్రియల్ కస్టర్ సీఐటీయూ కార్యకర్తల సమావేశంలో మానిక్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన కార్మికుల కనీస వేతనాల్లో శాస్త్రీయత ఎక్కడుందని నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే కనీస వేతనాలు మాత్రం శాస్త్రీయంగా పెంచలేదన్నారు. ముఖ్యమంత్రి ప్రకటన ఆర్భాటం తప్ప ఏమీ లేదని, కనీస వేతనాల జీవోలలో ఉన్న కనీస వేతనాల కంటే తగ్గించి ప్రకటించారని విమర్శించారు. డాక్టర్ ఆక్రాయిడ్ మరియు అనేకమంది శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం కనీస వేతనాలు రూ. 32000 ఉండాలని, కానీ సిఐటియు ట్రేడ్ యూనియన్లు 26000 పెంచాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త, రాష్ట్రవ్యాప్త సమ్మెలు, ఆందోళనలు, పోరాటాలు నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. కానీ వీటికి భిన్నంగా ముఖ్యమంత్రి కనీస వేతనాలను ప్రకటించడం దారుణమని, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస వేతనాలను తక్షణమే సవరిస్తూ రూ.26వేలకు పెంచాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రాజు, క్లస్టర్ నాయకులు వెంకటేష్, కిరణ్, సంపత్ రెడ్డి, శ్రీనివాస్, దుర్గయ్య, శ్రీనివాస్ గౌడ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
