ఓఆర్ఆర్ లోపలి రైతుల భూములను వెంటనే రెసిడెన్షియల్ జోన్లుగా మార్చాలి బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి

Districts politics Telangana

మనవార్తలు ప్రతినిధి , సంగారెడ్డి :

ఓఆర్ఆర్ లోపలి రైతుల భూములను వెంటనే రెసిడెన్షియల్ జోన్లుగా మార్చాలని బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి డిమాండ్ చేశారు. ఇవాళ ఈ రోజు లోక్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా జీహెచ్ఎంసీ పరిధిలోని బీజేపీ జిల్లా అధ్యక్షుల బృందం మర్యాదపూర్వకంగా కలిసి, నష్టపోతున్న పేద రైతులకు తక్షణమే న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ జోనింగ్ వ్యవస్థ పేరుతో గత 13 సంవత్సరాలుగా పేద, అమాయక రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. హైదరాబాద్ మరియు చుట్టుపక్కల జిల్లాల్లోని 1355 రెవెన్యూ గ్రామాల్లో ఉన్న సుమారు 50 వేల మంది పేద రైతుల పాలిట ప్రస్తుత HMDA మాస్టర్ ప్లాన్ ఒక శాపంగా మారిందని మండిపడ్డారు. 2013లో రూపొందించిన ఈ మాస్టర్ ప్లాన్ జోన్లలో గత 13 ఏళ్లుగా ఎలాంటి మార్పులు చేయకపోవడం దారుణమన్నారు.

కార్పొరేట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూములు రెసిడెన్షియల్, మల్టిపుల్ యూజ్ జోన్లలో ఉంటూ వారు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించుకుంటుంటే.. పేద రైతుల భూములను మాత్రం ‘కన్జర్వేషన్ (వ్యవసాయ) జోన్’ పరిధిలో ఉంచి ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిగా నిషేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రింగ్ రోడ్ లోపల ఉన్న పరిశ్రమల భూములను మార్చుకోవడానికి హిల్ట్ పాలసీని తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, పేద రైతుల భూములను మాత్రం ‘వ్యవసాయ జోన్’ లోనే ఉంచి ఎందుకు కక్ష సాధిస్తోందని ప్రశ్నించారు. ఒకటి లేదా రెండు ఎకరాలు ఉన్న చిన్నకారు రైతు కూడా తన పిల్లల భవిష్యత్తు కోసం, సొంత అవసరాల కోసం ఇల్లు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌ను తక్షణమే సమీక్షించి రైతులకు అనుకూలంగా జోన్లను మార్చాలి. రింగ్ రోడ్ వెలుపల ఉన్న రైతులకు తమ సౌకర్యానుసారం భూమి వినియోగ జోన్ మార్చుకునే అవకాశం కల్పిస్తూ, జోన్ మార్పిడి ప్రక్రియను సులభతరం చేయాలి. గౌడవెల్లి, ఘట్‌కేసర్, శంషాబాద్, నాగులపల్లి ప్రాంతాల్లో ఓఆర్ ఆర్ సర్వీస్ రోడ్లపై ఉన్న రైల్వే లైన్లకు వెంటనే వంతెనలు నిర్మించాలి.బీజేపీ ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలుస్తుంది, పేద రైతుల సంక్షేమం, వారి హక్కుల సాధన కోసం బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుంది.’ అని గోదావరి అన్నారు. ఈ కార్యక్రమంలో  మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు బుద్ది శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా మాజీ అధ్యక్షుడు కాంతరావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శంకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *