గీతంలో జాతీయ టెక్ ఫెస్ట్ హవానా ప్రారంభం

Telangana

మనవార్తలు ప్రతినిధి – పటాన్ చెరు:

ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రెండు రోజుల జాతీయ స్థాయి టెక్ ఫెస్ట్ హవానా-2026 మంగళవారం హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ లో ఘనంగా ప్రారంభమైంది. సాంకేతిక నైపుణ్యం అనుభూతులతో స్ఫూర్తిని రగిల్చే ఈ కార్యక్రమాన్ని ఈఈసీఈ విభాగానికి చెందిన జీ-ఎలక్ట్రా (స్మార్ట్ సిస్టమ్స్ క్లబ్) నిర్వహిస్తోంది. అత్యాధునిక ఆవిష్కరణలను అన్వేషించడానికి, సృజనాత్మకతను పెంపొందించడానికి, అవకాశాల సరిహద్దులను పునర్నిర్వచించడానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను ఆకర్షించేందుకు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం తోడ్పడుతోంది.ప్రారంభోత్సవంలో కాగ్నిటివ్ బోటిక్స్ చైర్మన్ ఉదయ కుమార్ దింత్యాల గౌరవ అతిథిగా పాల్గొన్నారు. విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి పరిశ్రమలను తీర్చిదిద్దడంలో సాంకేతికతకున్న పరివర్తన శక్తిని నొక్కిచెబుతూ, స్పష్టత, లక్ష్యంతో సమస్యలను పున:సృష్టించుకోవాలని విద్యార్థులను ప్రోత్సహించారు.

యాడ్ఆన్ మో సహ వ్యవస్థాపకుడు శ్రావంత్ గాజుల ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొని, కీలకమైన వ్యవస్థాపక అంతర్దృష్టులను పంచుకున్నారు. విద్యార్థులు కంఫర్ట్ జోన్ల నుంచి బయటకు వచ్చి, సమస్య పరిష్కారంపై దృష్టి సారించి, అర్థవంతమైన వృత్తిపరమైన నెట్ వర్కులను నిర్మించుకోవాలని సూచించారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ రమేష్ వడ్డి పాల్గొనగా, ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ మాధవి తాతినేని స్వాగతోపన్యాసం చేశారు. జీ-ఎలక్ట్రా ఉపాధ్యక్షుడు ఏ.వేణుగోపాల్ స్మార్ట్ సిస్టమ్స్ క్లబ్ కార్యకలాపాలపై నివేదికను సమర్పించగా, సంయుక్త కార్యదర్శి కె.శ్రావ్య వందన సమర్పణ చేశారు. సహ నిర్వాహకురాలు డాక్టర్ డి.అనిత, జీ-ఎలక్ట్రా అధ్యక్షుడు ఎం.గౌరీశంకర్ లతో కలిసి అధ్యాపకుడు ఎం. నరేష్ కుమార్ కార్యక్రమ నిర్వహణను సమన్వయం చేశారు.

హవానా-2026లో రోబో రేస్, రోబో సాకర్, ప్రాజెక్టు ఎక్స్ పో, హ్యాకథాన్, కోడథాన్ వంటి విభిన్న రకాల పోటీలతో పాటు, కృత్రిమ మేధస్సు, బ్లాక్ చెయిన్, రోబోటిక్స్ వంటి వర్ధమాన సాంకేతికతలపై సెషన్లు కూడా నిర్వహించారు. హైదరాబాదు నలుమూలల నుంచి 25 కళాశాలలకు చెందిన పలు బృందాలు ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.ఈ కార్యక్రమం విజ్జాన వినిమయం, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమలతో పరస్పర సహకారానికి ఒక ఉత్తేజకరమైన వేదికను అందించింది. తద్వారా ఆవిష్కరణలను, సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించాలనే గీతం యొక్క నిబద్ధతను ఇది మరింత బలోపేతం చేసింది. బుధవారం కూడా ఈ కార్యక్రమం కొనసాగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *