పటాన్‌చెరులో అంబరాన్ని అంటిన మహిళా దినోత్సవ సంబరాలు

politics Telangana

పటాన్‌చెరుకు తరలి వచ్చిన మహిళలోకం

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆలోచింపచేసిన ఉపన్యాసాలు..

మార్పు ఇంటి నుండి మొదలు కావాలి

ప్రతి మహిళా ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించాలి

ప్రత్యేక క్యాంపుల ద్వారా HPV వ్యాక్సిన్ పంపిణీ

మహిళా పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి ల ఆధ్వర్యంలో గురువారం పటాన్‌చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంబరాన్ని అంటాయి. నియోజకవర్గ పరిధిలోని మహిళా ప్రజా ప్రతినిధులు, వేలాదిమంది మహిళలు కార్యక్రమానికి హాజరయ్యారు. ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ అంశాలపై ప్రముఖులచే ఉపన్యాసాలు, బహుమతుల పంపిణీ కార్యక్రమాలు అందరిని ఉత్సాహపరిచాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ఒక కుటుంబంలో మహిళా విద్యావంతురాలు అయితే ఒక తరం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని కోరారు. సర్వైకల్ క్యాన్సర్ విముక్తి కోసం ప్రభుత్వం అందిస్తున్న HPV వ్యాక్సిన్ ను బాలికలతో మొదలు మహిళలందరూ వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైన పక్షంలో పటాన్‌చెరు నియోజకవర్గంలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి ప్రతి మహిళకు వ్యాక్సిన్ అందిస్తామని హామీ ఇచ్చారు.

గత 25 సంవత్సరాలుగా పటాన్‌చెరు కేంద్రంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఆడ కూతురు ఉన్నత చదువులు చదువుకోవాలన్న సమున్నత లక్ష్యంతో పటాన్చెరు పట్టణంలో కేజీ నుండి పీజీ వరకు ఆధునిక వసతులతో ప్రభుత్వ విద్యాసంస్థలు నెలకొల్పడం జరిగిందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియం చేసుకోవాలని కోరారు.జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు వంటిల్లు నుండి అంతరిక్షం వరకు తమ సత్తా చాటుతున్న నేటికీ గృహ హింసకు గురి కావడం బాధాకరమన్నారు. మహిళల పట్ల మార్పు తమ గృహాల నుండే మొదలు కావాలని అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మహిళల ఆర్థిక సమృద్ధికి పెద్దపీట వేస్తూ వేల కోట్ల రూపాయలు కేటాయించారని గుర్తు చేశారు.

ప్రముఖ వైద్యులు, ఎమ్మెల్యే జిఎంఆర్ కోడలు గూడెం కిరణ్మయి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి మహిళా విజయం వెనుక ఎందరో మహిళల త్యాగం నెలకొని ఉందని తెలిపారు. మహిళ ఆర్థిక అభ్యున్నతి, ఉన్నత అవకాశాలు పొందాలంటే సంపూర్ణ సహకారం అందించాల్సిన గురుతర బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కుటుంబానికి వెన్నెముకగా నిలిచే మహిళ తన ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి సంవత్సరం విధిగా ఆరోగ్య చికిత్సలు చేయించుకోవాలని కోరారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న HPV వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోవాలని కోరారు. అవసరమైన పక్షంలో జిఎంఆర్ ఫౌండేషన్ ద్వారా సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు మహిళల పట్ల ఏ విధంగా ప్రవర్తించాలో బాల్యం నుండే అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం డాక్టర్ కవితా రెడ్డి, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ ఆర్తి, ఎమ్మెల్యే జిఎంఆర్ సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, గూడెం కల్పన మధుసూదన్ రెడ్డి లు ప్రసంగించారు. మహిళా దినోత్సవ సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *