మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :
నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యం పరిరక్షణకు యోగ అత్యంత అవసరమని ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యం కావాలని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని పీవీ నరసింహ రావు ఆడిటోరియంలో పతంజలి యోగా సమితి, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారం రోజుల ఉచిత మెగా యోగ, ఆరోగ్య శిబిరాన్ని సోమవారం ఉదయం ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా మానసిక ప్రశాంతతను కూడా కలిగించే యోగను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.ప్రతి రోజూ కొద్ది సేపు యోగాసనాలు, ప్రాణాయామం చేయడం ద్వారా ఒత్తిడి తగ్గి, శరీరానికి నూతన శక్తి లభిస్తుందని అన్నారు. ప్రధానంగా ఉద్యోగస్తులు, విద్యార్థులు, గృహిణులు యోగను అలవాటు చేసుకుంటే ఆరోగ్య సమస్యలు తగ్గే అవకాశముందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకు యోగా పైన అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో సొంత నిధులతో ఉచిత యోగా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగ కీలకమని, ప్రతి ఒక్కరూ దీనిని రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. వారం రోజుల పాటు జరగనున్న యోగ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, పతంజలి యోగా సమితి రాష్ట్ర అధ్యక్షుడు శివుడు, నరసింహ, యోగా కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

