పటాన్ చెరులో అంజిరెడ్డి మార్నింగ్ వాక్
4 గంటల పాటు అధికారులతో కలిసి పర్యటన
దోషం చెరువు స్థలాన్ని కాపాడాలని హైడ్రా కమీషనర్ కు ఫోన్
వారంలోగా సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు
పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి:
రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన పారిశ్రామిక, రెవెన్యూ కేంద్రమైన పటాన్చెరు నేడు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచి, ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అన్న చందంగా తయారైందని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి అన్నారు. శనివారం పటాన్చెరు పరిధిలో అధికారులతో కలిసి ఆయన మార్నింగ్ వాక్ నిర్వహించి, స్థానిక ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. దేశం నలుమూలల నుండి వచ్చి స్థిరపడిన లక్షలాది మంది ప్రజలతో మినీ ఇండియాగా పేరుగాంచిన ఈ ప్రాంతంలో, మౌలిక వసతులు కరువవ్వడంతో సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.దశాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న నాయకులు పటాన్చెరును కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే వాడుకుంటూ, ప్రజల నిజమైన సమస్యలను గాలికి వదిలేస్తున్నారని అంజిరెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికే సరిపోతోందని, ఇక్కడ నయా పైస పని కూడా జరగడం లేదని విమర్శించారు. ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాంతం మరింత గొప్పగా, ఆదర్శవంతంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ప్రధాన రహదారులు, కాలనీల్లోని అంతర్గత రోడ్లపై ఎక్కడికక్కడ చెత్తాచెదారం పేరుకుపోవడం, మురుగునీరు నిలవడం, నివాస ప్రాంతాలలో తాగునీరు సక్రమంగా రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీల్లోకి మురుగునీరు చేరి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నా అధికారుల్లో చలనం లేదని అన్నారు. పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా వైద్య అవసరాలు తీర్చాల్సిన కొత్త దవాఖానను ప్రారంభించే తీరిక కూడా ఇక్కడి మంత్రికి లేదని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో కనీస వసతులు, మరుగుదొడ్లు లేక పేద విద్యార్థుల చదువు ప్రమాదంలో పడింది. నేతాజీ నగర్‌లోని అంగన్వాడీ కేంద్రంలో సహాయకులు లేక పిల్లల సంరక్షణకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు తెలిపారు. కాలనీల్లో రోడ్డు లైట్లు సరిగా వెలగకపోవడంతో రాత్రి వేళల్లో మహిళలు, వృద్ధులు ఒంటరిగా తిరగడానికి భయపడుతున్నారు. కొన్ని ఏరియాల్లో ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు కబ్జాకు గురవుతున్నా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపించారు.
బండ్లగూడ గోపాల్‌రెడ్డి కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో పాటు తాగునీటి సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడిందని స్థానికులు ఎమ్మెల్సీ దృష్టికి తెచ్చారు. అదే కాలనీకి చెందిన 75 ఏళ్ల వృద్ధుడు మొగులయ్యకు అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు వృద్ధాప్య పింఛన్ మంజూరు కాలేదని బాధితుడు వాపోయారు. దోషం చెరువులోకి మురుగునీరు చేరకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, పందుల బెడద విపరీతంగా పెరిగిందని ప్రజలు తెలిపారు. ‘ఇదే చెరువు అభివృద్ధికి 2022లో డ్రైనేజీ పైప్‌లైన్, వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి రూ. 1.15 కోట్లు మంజూరైనప్పటికీ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి.ఈ నేపథ్యంలో దోషం చెరువుకు సంబంధించి 16 ఎకరాల చుట్టూ అక్రమణలు కాకుండా చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో ఫోన్లో మాట్లాడి కోరాను. అలాగే శాంతినగర్‌లో మౌలిక వసతుల లేమితో ఇబ్బంది పడుతున్నారని, స్మశాన వాటిక స్థలాన్ని కబ్జాల బారిన పడకుండా సర్వే చేసి బౌండరీస్ గుర్తించాలని ఎమ్మార్వోను కోరుతున్నాను.
ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, అర్హులైన నిజమైన పేదలందరికీ ఎలాంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా అందాలి.సంబంధిత అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి, కేవలం కుర్చీలకే పరిమితం కాకుండా ఫీల్డ్ విజిట్లు చేసి నిజమైన ప్రజాధికారులుగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలి. ప్రజల ఇబ్బందికర పరిస్థితులపై సత్వరమే స్పందించి, నేడు స్థానికుల నుంచి వచ్చిన సమస్యలన్నింటినీ రాబోయే వారంలోగా పూర్తిగా పరిష్కరించాలి. ఎన్నికల వరకు మాత్రమే పార్టీలు, ఈ ప్రాంత బిడ్డగా పటాన్చెరు ప్రాంత సమగ్రాభివృద్ధి కోసం తన వంతు పూర్తి కృషి చేస్తాను ‘ అని అంజిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీనివాస్, సంబందిత అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన బీఆర్ఎస్ ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .ఇస్నాపూర్ మున్సిపల్…
రామచంద్రపురం , మనవార్తలు ప్రతినిధి: మత సామరస్యం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని…
పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్చెరు: ఉత్తర భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర ఛట్ పూజను పురస్కరించుకుని యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…
పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…
ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం దంపతులు రెండు వేల…
- సమాజాభివృద్ధికి అందించిన సేవలకు జాతీయ గుర్తింపు - పౌర సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట కృషి -…