పటాన్చెరు నియోజకవర్గ చరిత్రలోనే మొట్టమొదటిసారి..438 మంది 10వ తరగతి ప్రతిభావంతులకు సైకిళ్ల పంపిణీ.
35 లక్షల రూపాయల సొంత నిధులతో సైకిళ్ల కొనుగోలు
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు విద్యార్థుల కోసం మరో వినూత్న కార్యక్రమాన్ని ఆరంభించారు.
పటాన్చెరు నియోజకవర్గ చరిత్రలోనే మొట్టమొదటిసారి 2025 – 2026 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ ఫలితాలు సాధించిన 438 విద్యార్థులకు 35 లక్షల రూపాయల సొంత నిధులతో సైకిళ్ల పంపిణీ చేపట్టారు.శనివారం ఉదయం పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 48 ప్రభుత్వ పాఠశాలలు, 89 ప్రైవేటు పాఠశాలలో ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన 438 మంది విద్యార్థులకు 35 లక్షల రూపాయల సొంత నిధులతో కొనుగోలు చేసిన సైకిళ్లను ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా ఉన్నత లక్ష్యాల సాధనకు మరింత ఉత్సాహం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం పదవ తరగతి విద్యార్థులకు మానసిక వికాస శిక్షణా తరగతులతో పాటు పరీక్షా సామాగ్రి పంపిణీ చేస్తూ వారికి అండగా నిలుస్తున్నామని తెలిపారు. అనంతరం ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు నగదు బహుమతులు సైతం పంపిణీ చేసినట్టు గుర్తు చేశారు.ఈ విద్యా సంవత్సరం నుండి వినూత్నంగా సైకిల్లు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇందుకు అనుగుణంగా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ప్రైవేటు ఉన్నత పాఠశాలలో 10వ తరగతి ఫలితాల్లో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు సైకిళ్ళు కొనుగోలు చేసి అందించడం జరిగిందని తెలిపారు.

విద్యార్థినీ, విద్యార్థులకు పదో తరగతి జీవితం మలుపు తిప్పే కీలక దశ అని పేర్కొన్నారు. పదో తరగతిలో సాధించే ఫలితాలే భవిష్యత్ విద్యాభ్యాసానికి బలమైన పునాది అవుతాయని, లక్ష్యాలను నిర్దేశించుకొని కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సూచించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని పేర్కొంటూ, విద్యార్థినీ, విద్యార్థుల భవిష్యత్ కోసం తమవంతు సహకారం అందిస్తూనే ఉంటామని తెలిపారు.విద్యారంగ అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ, విద్యార్థులకు ఆత్మబంధువుగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సేవలు అందిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఆయా మండలాల విద్యాశాఖల అధికారులు, ప్రైవేటు పాఠశాలల ప్రిన్సిపాళ్లు, కరస్పాండెంట్లు సీనియర్ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
