సిఐటియు ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపర్ డెంట్ కు వినతి
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
పటాన్ చెరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వర్కర్లకు కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపర్ డెంట్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ పటాన్ చెరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో 40 మంది కార్మికులు గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని వీరంతా పేషెంట్ కేర్,హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, అటెండర్లు, ఆపరేషన్ థియేటర్లో హెల్పర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ప్రస్తుతం 11 వేల రూపాయల వేతనాలతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారని అన్నారు. హాస్పిటల్ వర్కర్లను ఏరియా హాస్పిటల్ లో శానిటేషన్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న గీత ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. రోజువారి పనులు నిర్వర్తించే క్రమంలో ప్రతి పనికి ఎవిడెన్స్ పేరుతో కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆరోపించారు. ఆసుపత్రి శానిటరీ ఇన్స్పెక్టర్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ఆరు సంవత్సరాలుగా ఒక పటాన్ చెరు ఏరియా హాస్పిటల్ లోనే ఏ విధంగా విధులు నిర్వర్తిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆమెను బదిలీ చేయాలని, హాస్పటల్లో కనీస సౌకర్యాలు కల్పించే విధంగా కార్మికులకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం 26వేల రూపాయలు చెల్లించే విధంగా జిల్లా అధికార యంత్రం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈపీఎఫ్ సౌకర్యాలు ఉన్న ఈఎస్ఐ సౌకర్యం పూర్తిగా కార్మికులకు అందుబాటులోకి రాలేదని, కేవలం ఎంప్లాయ్ కి తప్ప వాళ్ళ కార్మికుల కుటుంబాలకు ఎక్కడ ఉపయోగపడడం లేదని అన్నారు. అందుకోసం హాస్పిటల్ కార్మికుల సమస్యల పైన దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సతీష్, స్వామి, వీరేశం, శ్రీనివాస్, రాజు, రాంబాయి, అరుణ పాల్గొన్నారు.
