మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :
హైదరాబాద్ మాదాపూర్ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భవనంలో కాంట్రాక్టర్ల పేండింగ్ బిల్లులు చెల్లించాలని చలో హైదరాబాద్ మహసభను విజయవంతం చేయాలని చలో హైదరాబాద్ మహసభ పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంట్రాక్టర్లు మాట్లాడుతూ తెలంగాణవ్యాప్తంగా ఐదు నుంచి కోటి రూపాయల లోపు పనులు చేసే చిన్న తరహా కాంట్రాక్టర్లే అత్యధికంగా ఉన్నారు. పెద్ద పెద్ద బిల్డర్లకు ఆర్థిక వెసులుబాటు ఉన్నప్పటికీ,అప్పులు తెచ్చి పనులు చేసిన మధ్యతరగతి కాంట్రాక్టర్ల పరిస్థితి మాత్రం అత్యంత దయనీయంగా మారిందన్నారు. ఐదేళ్లుగా ఓపిక పట్టాం.ఉన్న ఆస్తులు,ఇళ్లు తాకట్టు పెట్టాం.బ్యాంక్ బ్యాలెన్స్ అంతా శూన్యమైంది.అప్పులు ఇచ్చిన వాళ్లు ఇంటి మీదకు వస్తుంటే.. తలదాచుకోలేక,ఇంటికి వెళ్లలేక రోడ్డున పడ్డాం. ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు ఇంత చిన్నచూపు చూస్తోంది?” అని కాంట్రాక్టర్లు కన్నీటిపర్యంతమవుతున్నారు.గత ప్రభుత్వం తమ బిల్లులను పక్కన పెట్టడంతో తీవ్ర నష్టాలు చవిచూశామని,కొత్త ప్రభుత్వమైనా తమను ఆదుకుంటుందని ఆశపడ్డామని.. కానీ ఇక్కడా నిరాశే ఎదురవుతోందని వారు వాపోతున్నారు. రాష్ట్రంలో అన్ని రకాల సంక్షేమ పథకాలకు నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం, రాత్రింబగళ్లు కష్టపడి పనిచేసిన తమ బకాయిలను ఎందుకు చెల్లించడం లేదని నిలదీస్తున్నారు. పెండింగ్ బిల్లులు రాక,అప్పుల బాధ తాళలేక ఇటీవల నాగర్‌కర్నూల్ జిల్లాలో ఒక కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన వీరి దయనీయ స్థితికి అద్దం పడుతోందనీ ఆవేదన వ్యక్తం చేశారు.
