పటాన్చెరు ఎమ్మెల్యే, ఉమ్మడి మెదక్ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
ఒలంపిక్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా శాఖ ఆధ్వర్యంలో క్రీడాకారుల కోసం కోచింగ్ కేంద్రాలు, క్రీడా పోటీలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు, ఒలంపిక్ అసోసియేషన్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని మైత్రి క్రికెట్ క్లబ్ కార్యాలయంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పటాన్చెరు ఎమ్మెల్యే, అధ్యక్షులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒలంపిక్ డే సందర్భంగా ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అతి త్వరలో ఒలింపిక్ రన్, మొక్కలు నాటడం, సైకిల్ ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. విద్యార్థి దశ నుండి క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా క్షేత్రస్థాయి నుండి క్రీడా పోటీలు, కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధి కోసం ఐదు మినీ స్టేడియాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మైత్రి మైదానం వేదికగా ఏడాది పొడవునా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు రఘునందన్ రెడ్డి, ఎల్లయ్య, హరికిషన్, బుచ్చిరెడ్డి, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
