30 గిన్నిస్ ప్రపంచ రికార్డులతో చరిత్ర సృష్టించిన గీతం పూర్వ విద్యార్థిని

Telangana

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని స్కూల్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థిని శివాలి శ్రీవాస్తవ (2016-2020 బ్యాచ్) అసాధారణ ఘనతను సాధించింది. ఆమె మొత్తం 30 గిన్నిస్ ప్రపంచ రికార్డులను సాధించి ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకున్నట్టు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.శివాలి, ఆమె తల్లిదండ్రులు కవితా శ్రీవాస్తవ, అనిల్ శ్రీవాస్తవలతో కలిసి మరో ఏడు కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డులను ఇటీవల అధికారికంగా అందుకున్నారు. దీంతో వారి కుటుంబం సాధించిన రికార్డుల సంఖ్య అపూర్వమైన 30కి చేరింది. ఈ ఘనతతో, భారతదేశంలో అత్యధిక గిన్నిస్ ప్రపంచ రికార్డులు కలిగిన వ్యక్తిగా శివాలి నిలిచారు.ఒరిగామి, పేపర్ ఆర్ట్ లో తన అసాధారణ ప్రతిభకు గుర్తింపు పొందిన శివాలి, సృజనాత్మకతను అంకితభావం, కచ్చితత్వం, పట్టుదలతో కూడిన ఒక అద్భుతమైన ప్రయాణంగా మలిచారు. ఆమె తన తల్లిదండ్రులతో కలిసి ఎంతో శ్రద్ధగా లక్షలాది కాగితపు కళాఖండాలను చేతితో రూపొందించి, వాటి కళాత్మక నైపుణ్యానికి ప్రపంచవ్యాప్త గుర్తింపును సంపాదించారు.శ్రీవాస్తవ కుటుంబానికి ఈ విజయాలు కేవలం రికార్డుల కన్నా ఎంతో ఎక్కువ. సహనం, కళాత్మక అభిరుచి, కఠోర శ్రమ, కుటుంబ సహకార బలానికి నిదర్శనంగా వారి ప్రయాణం నిలుస్తుంది.ఈ చారిత్రాత్మక విజయం సాధించినందుకు గీతం నాయకత్వం, అధ్యాపక బృందం, సిబ్బంది, విద్యార్థులు తదితరులు శివాలికి, ఆమె కుటుంబానికి హృనదయపూర్వక అభినందనలు తెలియజేశారు. కళ, ఆవిష్కరణ, సృజనాత్మకతల స్ఫూర్తిదాయక సమ్మేళనం ద్వారా భారతదేశానికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకొస్తున్న ఆమె విజయాల పట్ల వర్సిటీ వర్గాలు ఎంతో గర్వపడుతున్నాయి. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *