మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
‘అధునాతన భావనలు, బోధనా పద్ధతులు, విద్యా సాధనాలు’ అనే అంశంపై భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన మూడు రోజుల రెసిడెన్షియల్ వృత్తి వికాస కార్యక్రమం (ఆర్పీడీపీ) హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ ఫిజిక్స్ అసోసియేషన్ సహకారంతో, గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని భౌతికశాస్త్ర విభాగం నిర్వహించింది.భావనాత్మక అవగాహనను ప్రయోగాత్మక అభ్యాసం, వినూత్న బోధనా పద్ధతులతో అనుసంధానించడం ద్వారా పాఠశాల, యూజీ స్థాయిలలో భౌతికశాస్త్ర విద్యను బలోపేతం చేయడానికి దీనిని రూపొందించారు. తరగతి గది బోధనలో శాస్త్రీయ జిజ్జాస, క్రియాశీల అభ్యాసం, భావనాత్మక స్పష్టత, ప్రత్యక్ష ప్రయోగాలను ప్రోత్సహించడంపై దృష్టి సారించింది.ఈ ఆర్పీడీపీ దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థల నుంచి విశిష్ట విద్యావేత్తలు, అధ్యాపకులు, పరిశోధకులను ఒక చోట చేర్చింది. నిపుణుల ఉపన్యాసాలు, ప్రదర్శనలు, ముఖాముఖి ద్వారా, ఇందులో పాల్గొన్నవారు అధునాతన భౌతికశాస్త్ర భావనలు, ఆధునిక విద్యా సాంకేతికతలు, ఐసీటీ ఆధారిత బోధనా పద్ధతులు, తక్కువ ఖర్చుతో కూడిన ప్రయోగాత్మక పద్ధతులు, సిమ్యులేషన్లు, సమర్థవంతమైన విద్యార్థి మూల్యాంకన వ్యూహాలపై విలువైన అవగాహన పొందారు.
ఈ కార్యక్రమంలో విద్యుదయస్కాంత సిద్ధాంతం, ఫోటోనిక్స్, క్వాంటం కంప్యూటింగ్, సూపర్ కండక్టివిటీ, అయస్కాంతత్వం, అణు వికిరణం, స్వయంగా తయారు చేసుకునే (డీఐవై) ఫిజిక్స్ కిట్లు, వినూత్న తరగతి గది బోధనా పద్ధతులు, అభ్యసన మదింపు పద్ధతులు వంటి అనేక సమకాలీన అంశాలను చర్చించారు.తొలిరోజు, గీతం సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ ఎస్. అనంత రామకృష్ణ, విశిష్ట ఆచార్యులు ప్రొఫెసర్ బి.వి.ఆర్. టాటా, ప్రొఫెసర్ జి. రవికుమార్, ఐఐటీ మద్రాసు పూర్వ ఆచార్యుడు ప్రొఫెసర్ టి.ఎస్. నటరాజన్, ఐఐఎస్సీ బెంగళూరు ప్రొఫెసర్ విబోర్ సింగ్, బార్క్ పూర్వ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జి.ఎ. రామారావు వంటి ప్రఖ్యాత భౌతికశాస్త్ర విద్యావేత్తలు, పరిశోధకులు ఉపన్యాసాలు, ముఖాముఖి నిర్వహించారు. అధునాతన భౌతిక శాస్త్ర భావనలు, వాటి వాస్తవ ప్రపంచ అనువర్తనాలు, సమర్థవంతమైన తరగతి గది, ప్రయోగశాల బోధనా పద్ధతులపై వారు చర్చించారు. విద్యార్థుల భాగస్వామ్యాన్ని, భావనాత్మక అవగాహనను మెరుగుపరచడానికి ప్రత్యక్ష ప్రయోగాలు, ప్రదర్శనలు, అనుకరణలు, తక్కువ ఖర్చుతో కూడిన ప్రయోగాత్మక పద్ధతులను ఇందులో పొందుపరిచారు.
చివరి రోజున, భౌతికశాస్త్ర విద్య, బోధనా పద్ధతులు, అభ్యసన మదింపుపై ఒక ప్రత్యేక సదస్సును హైదరాబాదులోని మానుకు చెందిన ప్రొఫెసర్ వనజ, హోమీ భాభా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ దీపా చారి, గీతం స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రిచా శర్మ సంయుక్తంగా నిర్వహించారు. పాఠశాల, యూజీ స్థాయిలలో భౌతికశాస్త్ర విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో, ఈ సదస్సు అభ్యాసకుడి-కేంద్రీకృత బోధనా పద్ధతులు, తరగతి గదిలో భాగస్వామ్యం, అనుభవపూర్వక అభ్యసనం, ఫలితాధారిత మదింపు వ్యూహాలపై దృష్టి సారించారు.ఇందులో పాల్గొన్న భౌతికశాస్త్ర అధ్యాపకులు, తమ ప్రతిస్పందనలో, ఈ కార్యక్రమాన్ని ఎంతగానో ప్రశంసించారు. ప్రస్తుత విద్యా వాతావరణంలో భౌతికశాస్త్ర విద్యను మెరుగుపరచడానికి ఉన్నత భావనల పరిచయం, ప్రత్యక్ష ప్రయోగాలు, వినూత్న బోధనా పద్ధతులు అత్యవసరం అని వారు పేర్కొన్నారు. ప్రముఖ నిపుణులతో సంభాషించడానికి, వారి వృత్తిపరమైన సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి ఒక ప్రత్యేక వేదికను అదించినందుకు వారు గీతం యాజమాన్యానికి కృతజ్జతలు తెలియజేశారు.ఈ కార్యక్రమాన్ని భౌతికశాస్త్ర విభాగానికి చెందిన డాక్టర్ జి.సాయిప్రీతి, డాక్టర్ టి.విశ్వం సమన్వయం చేశారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…
మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, రైస్ మిల్ ఏర్పాటుకు త్వరలో భూమి…
అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో విద్యార్థులకు మార్గనిర్దేశం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగంలో విద్యార్థులకు…
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…