ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని వెంటనే సస్పెండ్ చేయాలి
ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అర్జున్
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యల గురించి ప్రశ్నించిన విద్యార్థులను వేధింపులకు గురిచేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఇస్నాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అర్జున్ డిమాండ్ చేశారు.సోమవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రధానోపాధ్యాయురాలి వేధింపులు, పాఠశాలలోని పలు సమస్యలను ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం దృష్టికి తీసుకురాగానే ఎస్ఎఫ్ఐ నాయకులు పాఠశాలకు చేరుకొని విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ సమస్యల గురించి అడిగితే ప్రధానోపాధ్యాయురాలు తమను అసభ్య పదజాలంతో దూషిస్తోందని, ప్రశ్నించిన వారికి టీసీ ఇచ్చి పంపించేస్తామని బెదిరింపులకు పాల్పడుతోందని కన్నీరు మున్నీరయ్యారు.
వారం రోజుల్లో సమస్యల పరిష్కారానికి మండల విద్యాశాఖ అధికారి హామీ
విద్యార్థుల సమస్యలను తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో ఆందోళనకు దిగారు. మండల విద్యాశాఖ అధికారి ఇక్కడికి రావాలని డిమాండ్ చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న ఎంఈఓ నాగేశ్వరరావు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చేరుకొని విద్యార్థులతో మాట్లాడారు. వారం రోజుల్లోగా పాఠశాలలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని విద్యార్థులకు ఆయన భరోసా ఇచ్చారు.అనంతరం అర్జున్ మాట్లాడుతు విద్యార్థుల సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం అండగా ఉంటుందని, విద్యార్థుల పట్ల అమానుషంగా, అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రధానోపాధ్యాయురాలు పై కఠిన చర్యలు తీసుకుని, ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి, లక్ష్మణ్ విద్యార్థి నాయకులు శ్రావణి, ప్రేమ్ దాస్ తదితరులు పాల్గొన్నారు.
