మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :
హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థి ఆకుల విశాల్ డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘సుస్థిర పదార్థంగా అల్ప కార్బన్ కాంక్రీటుపై ప్రయోగాత్మక పరిశోధనలు’ చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ అఖిలేష్ చేపూరి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.మౌలిక సదుపాయాల అభివృద్ధిని పర్యావరణ సుస్థిరతతో సమతుల్యం చేయాల్సిన అత్యవసర అవసరాన్ని ఈ అధ్యయనం తెలియజేస్తుందన్నారు. డాక్టర్ విశాల్ పరిశోధన, కొబ్బరి చిప్ప ఆధారిత తేలికపాటి కాంక్రీట్, బాసిల్లస్ సబ్టిలిస్ ఉపయోగించి బ్యాక్టీరియాతో స్వయంగా మరమ్మతు చేసుకునే కాంక్రీటు వంటి వినూత్న పద్ధతుల ద్వారా తక్కువ కార్బన్ ఉద్గారాలు గల, మన్నికైన కాంక్రీటును అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టిందని తెలిపారు.ఈ పరిశోధన ఫలితాలు మెరుగైన బలం, మన్నిక, పగుళ్లను తట్టుకునే సామర్థ్యం, అలాగే పర్యావరణ ప్రభావం తగ్గడం వంటి అంశాలను ప్రదర్శిస్తున్నాయన్నారు. కాంక్రీట్ నిర్మాణాల దీర్ఘాయువు, సుస్థిరతను పెంపొందించడానికి పర్యావరణ అనుకూల పదార్థాలు, జీవ ఆధారిత పద్ధతుల సామర్థ్యాన్ని ఈ అధ్యయనం హైలైట్ చేస్తోందని వివరించారు.డాక్టర్ విశాల్ సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ కోర్ ఇంజనీరింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.రమేష్, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందనలు తెలియజేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
