లక్డారం రైతుల భూములను రక్షించాలి

politics Telangana

ఎస్ టిపి ప్లాంటు ఏర్పాటును విరమించుకోవాలి

జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా, కలెక్టర్ కు వినతి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

లక్డారం గ్రామ రైతుల భూములను ఆన్ లైన్ లోకి ఎక్కించి, రైతుల భూములను రక్షించాలని సిపిఎం పార్టీ పటాన్ చెరు డివిజన్ కార్యదర్శి బి నాగేశ్వరరావు అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ 1973 వ సంవత్సరంలో లక్డారం గ్రామ రైతులకు 20 గుంటలు, ఒక్కొక్క ఎకరా చొప్పున దాదాపు 22 ఎకరాల భూములను అప్పట్లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇచ్చిన భూములను ఇందిరమ్మ రాజ్యంలో తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటాం అనడం సరైన పద్ధతి కాదన్నారు. 1973 నుండి నేటి వరకు గ్రామ రైతులు పంటలు వేస్తూ పొజిషన్ లో ఉండి బ్రతుకుతున్నారని అన్నారు. కానీ మండల రెవెన్యూ యంత్రాంగం 2001వ సంవత్సరం నుండి రైతులు పొజిషన్ లో లేరనే సాకు చూపి ఎస్ టి పి ప్లాంట్ ఏర్పాటు కోసం మేము 22 ఎకరాల భూములను కేటాయిస్తున్నామని చెప్పడం సరైన పద్ధతి కాదన్నారు.

ఒకవేళ రైతుల భూములను ప్రభుత్వం తీసుకుంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రైతులకు నోటీసులు ఇచ్చి, నష్టపరిహారం చెల్లించాలని, ఏ ఒక్క రైతుకు నోటీసు ఇవ్వకుండా, భూమిని ఎలా స్వాధీనం చేసుకునే చర్యలు చేపడతారని ప్రశ్నించారు. ఎస్ టి పి ప్లాంట్ ఏర్పాటు కోసం గ్రామంలో గ్రామ సభ నిర్వహించి నిర్ణయం తీసుకుంటే, ఎక్కడ వ్యతిరేకించమన్నారు. ఎస్ టి పి ప్లాంట్ ఏర్పాటు అయితే రుద్రారం, లక్డారం, చిట్కుల్ ,ఇస్నాపూర్, బేగంపేట గ్రామాలు పూర్తిగా వ్యర్ధ జలాలతో కలుషితమై పంట పొలాలు నాశనం అయ్యే అవకాశం ఉందని గుర్తు చేశారు. గత రెండు నెలల క్రితం అమీన్పూర్ బీరంగూడ ప్రాంతంలో ఎస్ టి పి ప్లాంటు ఏర్పాటు విషయంలో కాలనీల వాళ్లతో ప్రజాభిప్రాయ సేకరణ చేపడితే పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తేనే, లక్డారం గ్రామ రైతుల భూములపై కన్ను పడిందని మండిపడ్డారు. అమీన్పూర్ మండలంలోని గండిగూడ ఆసాని కుంట నుంచి వచ్చే కాలుష్య జలాలను పెద్ద పైప్ లైన్ ల ద్వారా ఎస్ టి పి ప్లాంట్ లోకి మళ్ళించి నక్క వాగులోకి తరలించే చర్యలు చేపడుతున్నారని, నక్క వాగులోకి కాలుష్య శుద్ధి జలాలు వెళితే సింగూరు, మంజీరా లోకి వెళ్లి పూర్తిగా కలుషితమై నీరును, మళ్లీ జిల్లా ప్రజల తాగు కోసం మనకి ఇచ్చే అవకాశం ఉందన్నారు.

దీనివల్ల లక్షలాదిమంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, అనేకమందికి చర్మవ్యాధులు, ఇతర వ్యాధుల బారిన పడే అవకాశం ఉందన్నారు. అందుకోసం లక్డారం గ్రామంలో ఎస్ టి పి ప్లాంట్ ఏర్పాటును విరమించుకోవాలని, లక్డారం గ్రామంలో రైతులు సాగు చేస్తున్న 498 సర్వే నెంబర్ లోని 22 ఎకరాల భూములను రైతులకు పూర్తిగా హక్కులు కల్పించే విధంగా జిల్లా రెవెన్యూ యంత్రాంగం తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లక్డారం గ్రామ రైతులు మల్లేశం, బలరాం, జీవన్ కుమార్, సాయిలు, ఉమాకాంత్, ప్రభు ఇతర గ్రామ రైతులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *