కార్మికుల ప్రాణాలకు భద్రతేది?
పరిశ్రమల భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యమెందుకు?
సిగాచి ఘటన మరువకముందే సరాక పరిశ్రమలో గ్యాస్ లీకేజీ.. ఇద్దరు కార్మికుల మృతి..
సిగాచి ఘటన నుండి గుణపాఠం నేర్చుకోవడంలో రేవంత్ ప్రభుత్వం వైఫల్యం..
మృతుల కుటుంబాలకు అండగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.. ఒక్కో కుటుంబానికి రూ.70 లక్షల పరిహారం.
అంత్యక్రియల కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయం..
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం..
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదం తాలూకు విషాదం మరువకముందే గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని సరాక పరిశ్రమలో గ్యాస్ లీకేజీ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. కార్మికుల ప్రాణాలకు భరోసా కల్పించాల్సిన పరిశ్రమల యాజమాన్యాలు పర్యవేక్షించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సరాక పరిశ్రమ గ్యాస్ లీకేజీ ఘటనలో మృతి చెందిన ఇద్దరు కార్మికుల కుటుంబాలకు యాజమాన్యంతో చర్చించి 70 లక్షల రూపాయల నష్టపరిహారంతో పాటు అంత్యక్రియల కోసం లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఘటనలో గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత యాజమాన్యాన్ని ఆదేశించారు.
సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. పరిశ్రమ యాజమాన్యంతో పాటు వివిధ శాఖల అధికారులతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఘటన పైన పూర్తి స్థాయి విచారణ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పటాన్చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్లి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. స్థానిక శాసనసభ్యుడిగా కుటుంబాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పారిశ్రామిక అభివృద్ధికి పటాన్చెరు ప్రాంతం కీలక కేంద్రంగా ఎదుగుతున్నప్పటికీ పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. పరిశ్రమల అభివృద్ధి అంటే కేవలం ఉత్పత్తి, లాభాల పెరుగుదల మాత్రమే కాదని.. అక్కడ పనిచేసే ప్రతి కార్మికుడి ప్రాణానికి భరోసా కల్పించడం కూడా అంతే ముఖ్యమని అన్నారు.
పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు సక్రమంగా అమలవుతున్నాయా? ప్రమాదాలను ముందుగానే గుర్తించే వ్యవస్థలు పనిచేస్తున్నాయా? గ్యాస్ లీకేజీలను నివారించే రక్షణ చర్యలు తీసుకుంటున్నారా? అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే ఏర్పాట్లు ఉన్నాయా? అనే అంశాలపై సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
సరాక పరిశ్రమలో గ్యాస్ లీకేజీకి దారితీసిన కారణాలను వెలికితీయాలని, ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. భద్రతా లోపాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని గుర్తించి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. పారిశ్రామిక ప్రాంతాల్లోని అన్ని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.సిగాచి ఘటన నుంచి తగిన గుణపాఠాలు నేర్చుకుని కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని, వరుస పారిశ్రామిక ప్రమాదాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని విమర్శించారు.
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవడంతో పాటు, బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని ఎమ్మెల్యే జీఎంఆర్ హామీ ఇచ్చారు. కార్మికుల భద్రత విషయంలో పరిశ్రమల యాజమాన్యాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రభుత్వ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
హైదరాబాద్, అక్టోబర్ 23, 2026: హైదరాబాద్లోని ప్రముఖ రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ బిల్డర్లలో ఒకరైన సైబర్ సిటీ బిల్డర్స్ అండ్…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : హైదరాబాద్ ఫుడ్ లవర్స్ కోసం సరికొత్త థీమ్ తో హియ్య స్పెస్ మండి రెస్టారెంట్…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఆపత్కాల సమయంలో నిరుపేదలకు ఆపన్న హస్తం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు…
కె.ఎస్.పి.పి. ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న నితిన్ ఎ. గోఖలే పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశ రక్షణ రంగంలోని త్రివిధ…
రైతులు దళారులను ఆశ్రయించొద్దు.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి బోనస్ పూర్తి స్థాయిలో చెల్లించాలి అధికారులకు ఎమ్మెల్యే గూడెం…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత అధ్యక్షతన రాబోయే గ్రేటర్ ఎలక్షన్స్ కు…