– ఫార్మశీ విద్యార్థులకు నోవార్టిస్ డెరైక్టర్ సుభాస్ చంద్ర ఉద్బోధ
మనవార్తలు ,పటాన్ చెరు:
మారుతున్న కాలంతో పాటు మనం నిత్యం వాడే ఔషధాలకు కాలం చెల్లిపోతోంది , అందువల్ల తదుపరి తరం ఔషధాలపై ఫార్మశీ విద్యార్థులు దృష్టి సారించాలని హైదరాబాద్ లోని నోవార్టిస్ గ్లోబల్ డ్రగ్ డెవలప్మెంట్ అసోసియేట్ డెరైక్టర్ ఎం.సుబాస్ చంద్ర ఉద్బోధించారు . గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీలో ‘ ఫార్మశీ అండ్ ఫార్మాస్యూటికల్ సెన్సైస్’పై శుక్రవారం నిర్వహించిన ఒకరోజు జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై కీలకోపన్యాసం చేశారు . మనం వినియోగిస్తున్న మాలి క్యూల్ ఔషధాలు త్వరలో కనుమరుగు కానున్నాయని , ఇకమీదట బయోలాజిక్స్ , బయోసిమిలర్లు , సెల్ – జీన్ థెరపీ , రేడియో మెడిసిన్తో వ్యవహరించే అధునాతన యాక్సిలరేటర్ అప్లికేషన్లు , న్యూక్లియర్ మెడిసిన్ వంటివి మనగడలోకి రానున్నట్టు చెప్పారు . ఈ రంగాలలోకి ప్రవేశించి , నూతన సవాళ్ళను ఎదుర్కోవడానికి విద్యార్థులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు . మానవ జీవితం నాలుగు స్తంభాలపై ఆధారపడి ఉంటుందని , ఆరోగ్యం , వృత్తి , ఆర్థిక నిర్వహణ , ఇతరులతో మన సంబంధాలుగా సుబాస్ అభివర్ణించారు .
అధ్యాపకుల కంటే కూడా కెరీర్ మెంటర్లకు ప్రాధాన్యం పెరిగిందని , వారు చేయిపట్టి నడిపించడంతో పాటు దీపపు స్తంభం వలె మార్గదర్శనం చేస్తారని , తల్లిదండ్రుల కంటే విద్యార్థులను బాగా అర్థం చేసుకుంటారని ఆయన చెప్పారు . సాఫ్ట్స్కిల్స్ లేక చాలామంది ప్రతిభావంతులైన విద్యార్థుల కూడా ఇంటర్వ్యూ దశలో తిరస్కరణకు గురవుతున్నారని , వాక్చాతుర్యం , ఇతరులతో కలిసి పనిచేయగలగడం , త్వరగా కొత్తవారితో కలిసిపోవడం , నిజాయితీ , సమగ్రతలను ప్రతిఒక్క విద్యార్థి పెంపొందించుకోవాలన్నారు . విజయం సాధించాలంటే విలువలు , ప్రవర్తనను కాపాడుకోవాలని స్పష్టీకరించారు . అభ్యాసం , ఆత్మవిశ్వాసం లేకుండా ప్రతిభకు అర్థం లేదని నొక్కి చెప్పారు . పోలిక , పోటీ , గందరగోళం అనే మూడు అంశాలు విద్యార్థులను అయోమయానికి గురిచేస్తున్నాయన్నారు . ప్రశ్నించే తత్త్వాన్ని ప్రతిఒక్కరూ అలవరచుకోవాలని ఆయన సూచించారు . మన నమ్మకాలను సరిదిద్దుకోవాలని , జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని , మనకంటూ ఓ గుర్తింపును పొందాలని చెప్పారు .
మనలో నిబిడీకృతంగా ఉన్న సామర్థ్యాన్ని కనుగొని , దానిని వెలికితీసే ప్రయత్నం చేయాలని విద్యార్థులకు సుబాస్ సలహా ఇచ్చారు . నాట్కో ఫార్మా అసోసియేట్ ఉపాధ్యక్షుడు డాక్టర్ బి.కృష్ణమూర్తి మాట్లాడుతూ , సాంకేతిక అభివృద్ధి చాలా వేగంగా జరుగుతోందని , దానిని ఫార్మా పరిశ్రమలో ఎలా వినియోగించుకోవచ్చో యోచించాలన్నారు . విజ్ఞానాన్ని పెంపొందించు కునేందుకు , కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఈ తరహా సదస్సులు దోహదపడతాయని స్లేబ్యాక్ ఫార్మా డెరైక్టర్ హరీష్ జి.చిన్నారి అభిప్రాయపడ్డారు . తొలుత , గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ స్వాగతవచనాలతో ఆరంభమైన ఈ కార్యక్రమంలో ఫార్మాస్యూటిక్స్ దిగ్గజుడిగా పేరొందిన ప్రొఫెసర్ సీవీ సుబ్రమణ్యం , జి.పుల్లారెడ్డి ఫార్మశీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.వీరేష్ , ఎంఎన్ఆర్ ఫార్మశీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.అళగరస్వామిలను సత్కరించారు . పరిశోధనా పత్రాల సంకలనాన్ని ఆవిష్కరించారు . జంట నగరాల్లోని దాదాపు 300 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నగా , నిర్వాహక కార్యదర్శి కింగ్స్టన్ రాజయ్య వందన సమర్పణతో ముగిసింది .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…