మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్, పటాన్చెరు బల్దియా సర్కిళ్ల పరిధిలో చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నట్లు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో అమీన్పూర్, పటాన్చెరు సర్కిల్ డిప్యూటీ కమిషనర్లతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు సర్కిళ్ల పరిధిలో చెత్త డంపింగ్ సమస్య జటిలంగా మారుతోందని వారు ఎమ్మెల్యే జిఎంఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు ఎమ్మెల్యే జిఎంఆర్ స్పందిస్తూ బల్దియా పరిధిలో ఇటీవల నూతనంగా ఏర్పడిన ఐదు డివిజన్లతో పాటు మిగిలిన నాలుగు డివిజన్ల పరిధిలో సేకరించిన చెత్తను డంపింగ్ చేసేందుకు ఐదు ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామని తెలిపారు. భూమి కేటాయించే వరకు ఇప్పటి వరకు చెత్త డంపింగ్ నిర్వహించిన రాంకీ సంస్థ ద్వారానే కార్యకలాపాలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని జిహెచ్ఎంసి కమిషనర్ కర్ణన్ ను కోరినట్లు తెలిపారు. అమీన్పూర్ డివిజన్ పరిధిలో చెత్త డంపింగ్ మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన కమిషనర్ కు తెలిపారు. చెత్త డంపింగ్ కోసం శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో అమీన్పూర్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, పటాన్చెరు డిప్యూటీ కమిషనర్ సురేష్, తదితరులు పాల్గొన్నారు.
