ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి
శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్, కమిషనర్ కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె నోటీస్
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు ఆరోపించారు. ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెను పురస్కరించుకొని మంగళవారం జిహెచ్ఎంసి శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్, కమిషనర్ కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె నోటీస్ ను ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని, పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినాలను, రద్దుచేసి ప్రస్తుతం 12 గంటలకు పెంచడం అన్యాయమని, కార్మికులు కార్మిక సంఘాలు పెట్టుకోకుండా కార్మికుల సంఖ్య ఎక్కువ పరిమితి పెంచడం అన్యాయమన్నారు. సమ్మెకు, యూనియన్ల రిజిస్ట్రేషన్లు భవిష్యత్తులో ప్రమాదంలో పడతాయని, కార్మికులు తమ సమస్యలపై ప్రశ్నించే హక్కును కోల్పోయే ప్రమాదం ఉంటుందని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సంస్కరణలను, కార్మిక చట్టాల్లో మార్పులను మరింత వేగవంతం చేశారని విమర్శించారు. రైతులకు హాని కలిగించే నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
పటాన్ చెరు నియోజకవర్గంలో జిహెచ్ఎంసి కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, పటాన్ చెరు సర్కిల్లోని పటాన్ చెరు, ముత్తంగి, తెల్లాపూర్, అమీన్పూర్, రామచంద్రపురం, బీరంగూడ, బొల్లారం డివిజన్లో జిహెచ్ఎంసి మున్సిపల్ కార్మికులు దాదాపు 2వేలమంది ఉన్నారని, వీరందరికీ కనీస వేతనం 26వేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. వచ్చే పదిహేను వేల ఆరు వందల రూపాయలు ఏ మాత్రం సరిపోవడం లేదన్నారు. జిహెచ్ఎంసి కార్మికుల సమస్యల పైన సిఐటియు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.కార్మిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఫిబ్రవరి 12న జరిగే ఒకరోజు దేశవ్యాప్త సమ్మేను కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కృష్ణ, జయరాం తదితరులు పాల్గొన్నారు.
