మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం:
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలంలోని అంతర్జాతీయ పరిశోధనా సంస్థ ఇక్రిశాట్ లో గత అనేక ఏండ్లుగా చాలిచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యకు ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం లభించింది. ఏండ్ల తరబడి వేతనాల పెంపులేక, కనీస సెలవులు కూడా దక్కక సతమతమవుతున్న సుమారు 300 మంది నెలవారీ మరియు దినసరి ఉద్యోగుల జీవితాల్లో ఎమ్మెల్సీ చొరవతో కొత్త వెలుగులు నిండాయి. ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం గతంలో ఎన్నోసార్లు ధర్నాలు, ఆందోళనలు చేసినప్పటికీ యాజమాన్యం నుంచి స్పందన కరువైంది. ఈ నేపథ్యంలో బాధిత ఉద్యోగులు స్థానిక ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డిని కలిసి తమ సమస్యలను చెప్పారు. స్పందించిన ఎమ్మెల్సీ వెంటనే రంగంలోకి దిగి, సంబంధిత ఏజెన్సీ యజమాన్యంతో పాటు కేంద్ర, రాష్ట్ర కార్మిక శాఖాధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు. అధికారులపై మరియు యాజమాన్యంపై తీవ్రస్థితిలో ఒత్తిడి తెచ్చి ఉద్యోగులకు న్యాయం జరిగేలా కృతనిశ్చయంతో కృషి చేశారు. ఎమ్మెల్సీ పట్టుదల, నిరంతర చొరవ వల్లే దశాబ్దాల సమస్య పరిష్కారమైంది. ఇక్రిశాట్ సంస్థ చరిత్రలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల తరపున ఇలా వేతనాలు పెరిగి, అధికారికంగా సెలవులు మంజూరు కావడం ఇదే మొదటిసారి కావడం విశేషం.ఈ చర్చల ఫలితంగా నెలవారీగా పనిచేసే ఉద్యోగులకు నెలకు రూ. 1,500 చొప్పున దినసరి వేతనం ప్రకారం పనిచేసే ఉద్యోగులకు రోజుకు రూ. 50 చొప్పున వేతనం పెంచడంతో పాటు, ఏడాదికి 18 సెలవులు మంజూరు చేయడానికి యాజమాన్యం ముందుకు వచ్చింది.ఎట్టకేలకూ ఎమ్మెల్సీ చొరవతో తమ బాధలు పోయి జీవితాల్లో వెలుగులు నిండాయని ఇక్రిశాట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించి కుటుంబాల మోముల్లో నూతన ఉత్సాహాన్ని నింపిన ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డికి, బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి కి కృతజ్ఞతలు తెలిపేందుకు మంగళవారం సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని ఆయన నివాసంలో ఇక్రిశాట్ ఉద్యోగులంతా పెద్ద సంఖ్యలో కలిసి వారికి ధన్యవాదాలు తెలిపారు.
