కార్మిక,రైతు,ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోకపోతే మోడీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు
నాలుగు లేబర్ కోడ్స్ రద్దుయ్యే వరకు పోరాటాలు
పటాన్ చెరు పిఎఫ్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో బైఠాయింపు
సిఐటియు కార్మిక నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలింపు
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోకపోతే కేంద్ర బిజెపి ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే మల్లికార్జున్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం దేశవ్యాప్త జైల్ భరో సందర్భంగా పటాన్ చెరు పిఎఫ్ కార్యాలయం ముందు బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు గడిచిన ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. కార్మికుల చట్టాలు రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ తెచ్చి కార్మికులను బానిసలుగా మారుస్తున్నారని మండిపడ్డారు. రైతులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారని, రైతు ఉద్యమానికి తలొగ్గిన మోడీ ప్రభుత్వం రైతు నల్ల చట్టాలను రద్దుచేసిందని గుర్తు చేశారు. నీట్ పేపర్ లీకేజ్ కి వ్యతిరేకంగా విద్యార్థులు యువకులు పోరాటంతో కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచడంతో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయవలసి వచ్చిందని చెప్పారు.
విద్యుత్ విత్తన చట్టాలకు సవరణలు చేస్తూ కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు మోడీ కంకణం కట్టుకున్నారని విమర్శించారు. ఉపాధి కూలీలు పొట్టగొట్టే విబి జీ రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కనీస వేతనాలు 42,000 పెంచాలని డిమాండ్ చేశారు. పోరాటాలతో మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్ మాట్లాడుతు కేంద్ర మోడీ ప్రభుత్వానికి కార్మికులు, రైతులు, కూలీలు,విద్యార్థులు యువకులు ప్రధానమంత్రి సీటు ఏమైనా ఇవ్వమని అడిగారా..? సమస్యలు పరిష్కరించాలని అడిగితే దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తారా అని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను గాలికి వదిలేసిందని, కార్మిక, రైతు, కూలీల విద్యార్థుల, యువకుల గురించి దేశ ప్రధాని మోడీ కి పట్టించుకునే తీరిక లేదని, దేశాన్ని కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతుందని విమర్శించారు. కార్మికులు, రైతులు, కూలీలు, ప్రజలందరూ ఏకమైతే కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించుతారని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఆందోళన చేస్తున్న సిఐటియు కార్మిక నేతలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు ఎండి వాజిద్ అలీ, జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు రాజు, శాంత్ కుమార్, సుధాకర్, శ్రీధర్ నాయకులు రామ్మోహన్ రెడ్డి, గంగాధర్, ఏడుకొండలు, భరత్ జిల్లా ఉపాధ్యక్షులు అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
