గణితశాస్త్రంలో నరేందర్ సత్వాయికి పీహెచ్.డీ.

Telangana

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి నరేందర్ సత్వాయి డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘పారగమ్య సంకుచిత నాళికలలో నాన్-న్యూటోనియన్ ద్రవ ప్రవాహాల గణిత పరిశీలన’పై ఆయన అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ గణిత శాస్త్ర విభాగం ప్రొఫెసర్ డాక్టర్ కె. మారుతీ ప్రసాద్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ డాక్టరల్ పరిశోధన, సంకుచిత ధమనులలో రక్త ప్రవాహ గతి శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి, హృదయ సంబంధ వ్యాధులపై వాటి ప్రభావాలను తెలుసుకోవడానికి గణిత నమూనాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుందని తెలియజేశారు.ఈ పరిశోధన వివిధ నాన్-న్యూటోనియన్ ద్రవ నమూనాలను పరిశీలిస్తుందని, రక్త ప్రవాహ లక్షణాలపై ధమని పారగమ్యత, అయస్కాంత క్షేత్రాలు, ఉష్ణ వికిరణం, నాళ స్థితిస్థాపకత వంటి కారకాల ప్రభావాన్ని విశ్లేషిస్తుందని వెల్లడించారు. ఈ పరిశోధన ఫలితాల ఆధారంగా హృదయ సంబంధ వ్యాధులపై మెరుగైన అవగాహన కలుగుతుందని, రోగ నిర్ధారణ విశ్లేషణ, చికిత్స ప్రణాళిక, బయోమెడికల్ పరికరాల అభివృద్ధికి విలువైన అంతర్దృష్టులను అందిస్తుందని వివరించారు.డాక్టర్ నరేందర్ సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం.రెజా, గణిత, గణాంక శాస్త్ర విభాగాధిపతి డాక్టర జాదవ్ గణేష్, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *