సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా యువ కార్మికులు పోరాడాలి
దోచుకోవడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్న సామ్రాజ్యవాద శక్తులు
విద్యార్థులు,యువ కార్మికులు తమ హక్కుల కోసం… ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలి
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
ప్రపంచ ప్రజలకు సామ్రాజ్యవాదమే ప్రధాన శత్రువని, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కార్మికులు, యువత ఐక్యంగా పోరాడాలని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత దేశ యువతపై ఎంతైనా ఉందని చెప్పారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పట్లోళ్ల పాండురంగారెడ్డి పిలుపునిచ్చారు.పటాన్చెరు పట్టణంలోని శ్రామిక్ భవన్ లో జీ.గణేష్ అధ్యక్షతన యువ కార్మికుల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పాండురంగారెడ్డి మాట్లాడుతూ, సామ్రాజ్యవాదానికి ప్రజల సంక్షేమం కంటే లాభాలే ప్రధానమన్నారు. ప్రపంచ దేశాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం, ప్రజలపై ఆధిపత్యం సాధించడం, యుద్ధాలను ప్రోత్సహించడం ద్వారా సామ్రాజ్యవాద శక్తులు తమ ప్రయోజనాలను కాపాడుకుంటున్నాయని విమర్శించారు.సామ్రాజ్యవాద విధానాల వల్ల ప్రపంచవ్యాప్తంగా కార్మికులు, రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు.
ఆయా దేశాల సహజ వనరులు, సంపదను దోచుకోవడమే లక్ష్యంగా సామ్రాజ్యవాద శక్తులు వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు.కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సామ్రాజ్యవాద శక్తులకు అనుకూలంగా, ముఖ్యంగా అమెరికాకు లొంగిపోయే విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు. దేశ ప్రయోజనాలు, ప్రజల సంక్షేమం కంటే కార్పొరేట్ మరియు సామ్రాజ్యవాద ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఆందోళనకరమన్నారు.ఇటీవల ఢిల్లీలో విద్యార్థులు నిర్వహించిన పోరాటాన్ని ఆయన అభినందించారు.
విద్యార్థులు, యువ కార్మికులు తమ హక్కుల కోసం ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలని, ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.యువ కార్మికులు కేవలం పరిశ్రమల్లో తమ హక్కుల కోసం మాత్రమే కాకుండా, దేశ ప్రజల హక్కులు, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, శాంతి కోసం కూడా పోరాటాల్లో ముందుండాలని, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కార్మికవర్గ ఐక్యతను మరింత బలోపేతం చేయాలని ఈ సందర్భంగా యువ కార్మికులకు పిలుపునిచ్చారు.ఈ సదస్సులో వివిధ పరిశ్రమలకు చెందిన కార్మికులు, యువ కార్మికులు పాల్గొన్నారు.
