పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలి

politics Telangana

విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా

ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు టి. అర్జున్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు టి అర్జున్ ప్రభుత్వం డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీగా వెళ్లి తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు తమ సమస్యలను వివరించారు.ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతు విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెబుతున్న ప్రభుత్వం, నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని ప్రశ్నించారు.స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల కాకపోవడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో అనేక కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్నాయని, ఆర్థిక స్థోమత లేని విద్యార్థులు చదువును కొనసాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.

విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన ప్రభుత్వమే వారి చదువుకు అడ్డంకిగా మారడం బాధాకరమన్నారు.విద్యార్థులకు కేవలం స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ మాత్రమే కాకుండా నాణ్యమైన విద్య, తాగునీరు, మరుగుదొడ్లు, లైబ్రరీలు, ల్యాబ్‌లు తదితర కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అనేక విద్యాసంస్థల్లో కనీస సదుపాయాలు సరిగా లేకపోయినా సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో చెప్పాలన్నారు.పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు ఎప్పుడు విడుదల చేస్తారని,ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎప్పుడు చెల్లిస్తారని,పేద విద్యార్థుల చదువుకు ప్రభుత్వం ఎప్పుడు భరోసా కల్పిస్తుందని ప్రభుత్వాన్ని పరిశీలించారు.

విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం ఇకనైనా నిర్లక్ష్యం చేయకుండా పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేసి, విద్యార్థుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులను ఐక్యం చేసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం పటాన్‌చెరు డివిజన్ కార్యదర్శి శాంసన్, బాలాజీ, నరేష్, శ్రీవాణి, శిరీష విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *