అమాయక చిన్నారులతో మత మార్పిడిని ప్రోత్సహిస్తారా?
ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి తీవ్ర ఆగ్రహం
చిట్కుల్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ లో ఘటన
కలెక్టర్, ఉన్నతాధికారులకు తక్షణ విచారణ ఆదేశాలు
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
ప్రభుత్వ బడుల్లో మత ప్రచారాలు ఎలా ప్రోత్సహిస్తారు? విద్యార్థినిల పుస్తకాలతో పాటు ఇతర మతాలకు చెందిన పుస్తకాలు పాఠశాలలోకి ఎలా అనుమతిస్తారని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అధికారుల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన సంగారెడ్డి జిల్లా చిట్కుల్ బాలికల సాంఘిక సంక్షేమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ క్రమంలో పాఠశాలలో విద్యా సంస్థల నిబంధనలకు విరుద్ధంగా మత ప్రచారాలు, అనధికారిక కార్యకలాపాలు జరుగుతున్న విషయం ఆయన దృష్టికి రాగా అధికారులపై మండిపడ్డారు. పాఠశాలలో విద్యార్థినులకు అందుతున్న వసతులు, విద్యాబోధన తీరు మరియు మౌలిక సదుపాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి రుచి, శుచిని స్వయంగా ఆరా తీశారు.
ఈ తనిఖీ సమయంలో పాఠశాలలో ఇతర మతాలకు సంబంధించిన పుస్తకాలు పెద్ద ఎత్తున లభించడం, ప్రతి ఆదివారం ప్రత్యేక మందిరం ఏర్పాటు చేసి మతపరమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన గుర్తించి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 28 ప్రకారం ప్రభుత్వ నిధులతో నడిచే విద్యాసంస్థల్లో, ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి మత ప్రచారాలు, ప్రార్థనలు నిర్వహించడానికి వీలేదని ఆయన స్పష్టం చేశారు. పవిత్రమైన విద్యా దేవాలయాలను ఇతర కార్యకలాపాలకు వేదికగా మారుస్తున్న తీరుపై మండిపడ్డారు. నిబంధనలను ఉల్లంఘించి మత ప్రచారానికి పాల్పడిన సంబంధిత ఉపాధ్యాయులు, సిబ్బందిపై వెంటనే సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
ఈ అంశంపై జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ విజయేంద్ర జోషి, జోనల్ ఆఫీసర్ భీమయ్యలతో వెంటనే ఫోన్ లో మాట్లాడారు. పాఠశాలలో జరుగుతున్న అనధికార మతపరమైన కార్యకలాపాల వివరాలను వారికి వివరించి, తక్షణమే విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా అన్ని వసతుల కోసం యేటా ప్రతి విద్యార్థి మీద రూ. 1.8 లక్ష ల ఖర్చు చేస్తోందని ప్రభుత్వం కల్పిస్తోందని, విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలిపారు. విద్యార్థులు కేవలం చదువుపైనే శ్రద్ధ పెట్టి పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కల్పన, ఉపాధ్యాయులు, నాయకులు సుభాష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
