మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :
రానున్న రోజుల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ జెండా ఎగుర వేస్తామని ఆ పార్టీ ఇంచార్జీ వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ అన్నారు. గురువారం రోజు ఆయన ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ శంకరోళ్ల సురేష్ ముదిరాజ్ టిఆర్ఎస్ పార్టీ లో చేరారు. సురేష్ సమక్షంలో మియాపూర్, కొండాపూర్ డివిజన్లకు చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుండి సుమారు 30 మంది నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికీ వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ పార్టీ కండువాలు కప్పి, సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ మాట్లాడుతూ భవిష్యత్తులో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరియు 2028 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నాయకులందరూ సమిష్టిగా కృషి చేసి పార్టీ గెలుపునకు, కవిత ను సీఎం చేయడమే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి అన్ని వర్గాల ప్రజల నుండి విశేష మద్దతు లభిస్తోందని, రాబోయే రోజుల్లో తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా గెలిచేది టీఆర్ఎస్ పార్టీయేనని స్పష్టం చేశారు.ఈ రోజు పార్టీలో చేరిన వారిలో సురేష్ శంకరొళ్ల, మధు కిరణ్, నరేంద్ర రెడ్డి, రాణి, పార్వతమ్మ, వరమ్మ, సరోజ, అంజమ్మ, భూదేవి, దిలీప్, వెంకటేష్, మహేష్, మధుబాబుల తో పాటు మరికొంత మంది జాయిన్ అయ్యారు . ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు కిషోర్, లావణ్య బండారి, విష్ణు, దయానంద్ గుండె, మురుగేసన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
