పటాన్‌చెరులో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా 

politics Telangana

ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 

జాతీయ జెండాను ఎగరవేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ 

అందరి సహకారంతో అభివృద్ధిలో అగ్రగామిగా పటాన్‌చెరు నియోజకవర్గం 

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

ప్రజల సహకారం సమష్టి కృషితో పటాన్‌చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నామని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని జిహెచ్ఎంసి కార్యాలయం, ఎంపీడీవో, ఎమ్మార్వో, వివిధ సంక్షేమ సంఘాల కార్యాలయాలతో పాటు, మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన పంద్రాగస్టు వేడుకల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాలను ఎగురవేశారు. ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక, మార్చ్ ఫాస్ట్ కార్యక్రమాలు అందరిని అలరించాయి.

అనంతరం ఏర్పాటుచేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ మినీ ఇండియా గా పేరుందిన పటాన్‌చెరులో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు.కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందించేలా పటాన్‌చెరులో ప్రాథమిక పాఠశాల నుండి పీజీ కళాశాల వరకు ఆంగ్లం, తెలుగు మాధ్యమాల్లో విద్యను అందించడం జరుగుతుందన్నారు. పాలిటెక్నిక్ కళాశాల సైతం విద్యార్థులకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ఎంతో నమ్మకంతో వారి భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారని అన్నారు. నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా విద్యార్థులు క్రమశిక్షణతో, పట్టుదలతో చదువుకోవాలని సూచించారు.

విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. క్రమం తప్పకుండా క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవచ్చన్నారు.స్థానిక స్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగే అవకాశాలు క్రీడల ద్వారా లభిస్తాయని, ప్రతిభ కలిగిన క్రీడాకారులు ప్రపంచ వేదికపై దేశానికి, రాష్ట్రానికి, తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.  సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.

క్రీడాకారుడికి 50 వేల రూపాయల ప్రోత్సాహక బహుమతి

పటాన్‌చెరు పట్టణానికి చెందిన నర్రా వీరస్వామి ఇటీవల శ్రీలంకలో జరిగిన బాడ్మింటన్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా 50వేల రూపాయల ప్రోత్సాహంగా బహుమతి అందించి అభినందనలు తెలిపారు.అనంతరం స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మార్చ్ ఫాస్ట్, సాంస్కృతిక కార్యక్రమాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పాఠశాలలకు మూడు లక్షల 80 వేల రూపాయల సొంత నిధులతో నగదు బహుమతులు అందజేశారు. యువజన వికాస సమితి ఆధ్వర్యంలో 80 అడుగుల జాతీయ జెండాతో ప్రత్యేక పరేడ్ అందరిని ఆకర్షించింది.మార్చ్ ఫాస్ట్ విభాగంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు ప్రథమ బహుమతి, మంజీరా హై స్కూల్ కు ద్వితీయ బహుమతి, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కి తృతీయ బహుమతి లభించింది. సాంస్కృతిక కార్యక్రమాల విభాగంలో శాంతినికేతన్ ఉన్నత పాఠశాలకు ప్రథమ బహుమతి, జిల్లా పరిషత్ హై స్కూల్ పటాన్‌చెరు కు ద్వితీయ బహుమతి, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కు తృతీయ బహుమతి లభించింది.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, యువజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, క్రీడాకారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *