మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారుఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్తంగి పీఎస్ ఆర్ గార్డెన్స్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు . పటాన్ చేరు మండల ఇంచార్జ్ మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్, లక్డారం, రుద్రారం, పాశంమైలారం గ్రామాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కాంగ్రేస్ ప్రభుత్వం నయవంచన పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను బలపరిచే అభ్యర్థులను గెలిపించే దిశగా సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, దీనిని “బాకీ కార్డు” ద్వారా ప్రజలకు స్పష్టంగా వివరించే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని వారు గుర్తుచేశారు. ప్రతి ఇంటికీ కాంగ్రేస్ వైఫల్యాలను చాటి చెప్పాలని సూచించారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్లిందని, రైతులు, కార్మికులు, మహిళలు, పేదల సంక్షేమమే లక్ష్యంగా అనేక చారిత్రాత్మక పథకాలు అమలు చేశామని గుర్తుచేశారు. నేడు ఆ అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని, ప్రజలు అన్ని రంగాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్‌ను రాజకీయంగా దెబ్బతీయాలన్న కక్షపూరిత చర్యలతో కాంగ్రేస్ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోందని విమర్శించారు.రానున్న మున్సిపల్ ఎన్నికలను కేవలం స్థానిక సంస్థల ఎన్నికలుగా కాకుండా, కాంగ్రేస్ నయవంచన పాలనపై ప్రజలు తీర్పు చెప్పే ఎన్నికలుగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. పటాన్ చేరు నియోజకవర్గం పరిధిలో బీఆర్ఎస్‌ను మరింత బలోపేతం చేసి, ప్రజల నమ్మకాన్ని తిరిగి సాధించేలా ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని సూచించారు.మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయదలచిన ఆశావహులు తమ దరఖాస్తులను సంబంధిత ఇంచార్జ్‌ల ద్వారా రాష్ట్ర పార్టీకి అందించాలని, సర్వేల ఆధారంగా పార్టీ అభ్యర్థులను ఎంపిక చేస్తుందని తెలిపారు. పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిర్ణయిస్తే వారికే మద్దతుగా అందరూ కంకణబద్ధులై శ్రమించి పార్టీ గెలుపు కోసం పని చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఏరోళ్ల శ్రీనివాస్,నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి,ఇంద్రేశం మున్సిపల్ ఇంచార్జ్ శ్రీనివాస్,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సోమిరెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు .
