నైపుణ్యాభివృద్ధే భవితకు భరోసా

Telangana

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన సీనియర్ డేటా సైంటిస్ట్ ప్రవీణ్ కుమార్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కృత్రిమ మేథస్సు, డేటా సైన్స్ లో నైపుణ్యాభివృద్ధి సాధించాలని, అప్పుడు ఉద్యోగాలే మనను వెతుక్కుంటూ వస్తాయని ఆమ్జెన్ ఇండియా సీనియర్ డేటా సైంటిస్ట్, ఏఐ లీడ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణితం, గణాంకాల విభాగం ఆధ్వర్యంలో ‘నేర్చుకోవడానికి, నిర్మించడానికి, వినియోగించడానికి అవసరమైన కృత్రిమ మేధస్సు ప్రాథమికాంశాలు’ అనే అంశంపై శనివారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు.డేటా సైన్స్, అనలిటిక్స్, కృత్రిమ మేధస్సులో దాదాపు 14 ఏళ్లకు పైగా ఆయనకున్న పరిశ్రమ అనుభవాన్ని ఉపయోగించి, ప్రవీణ్ కుమార్ వాస్తవ ప్రపంచంలో కృత్రిమ మేధస్సు పరిష్కారాలను నేర్చుకోవడం, నిర్మించడం, వినియోగించుకోవడంపై ఆచరణాత్మక విధానాలతో కూడిన విలువైన అంతర్దృష్టులను పంచుకున్నారు. పరిశ్రమ అంచనాలు, ఆరోగ్య సంరక్షణ, కేంద్రీకృత కృత్రిమ మేధస్సు వినియోగం, జనరేటివ్ ఏఐలో ఉద్భవిస్తున్న ధోరణులను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఇది విద్యార్థులకు ఆ రంగంలో ప్రస్తుత, భవిష్యత్తు అవకాశాలపై స్పష్టమైన దృక్పథాన్ని ఏర్పరచింది.

ఈ కార్యక్రమంలో గీతం, ఇతర కళాశాలల ఎమ్మెస్సీ డేటా సైన్స్ విద్యార్థులు, పలువురు అధ్యాపకులు దాదాపు 300 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ బీ.ఎం.నాయుడు, ప్రిన్సిపాల్ డాక్టర్ మోతహర్ రెజా హాజరయ్యారు. పరిశ్రమ-విద్యా సహకారాన్ని బలోపేతం చేయడంలో గీతం నిబద్ధతను వారు ప్రోత్సహించారు. ఈ ఆతిథ్య ఉపన్యాస కార్యక్రమాన్ని గణిత, గణాంక విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.మల్లికార్జునరెడ్డి సమన్వయం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *