పటాన్చెరులో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు..

politics Telangana

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం..

వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో మార్మోగిన సాకి చెరువు కట్ట

ప్రత్యేక ఆకర్షణగా రచ్చ రవి బృందం ప్రదర్శనలు.. విజేతలకు రూ.50 వేల నగదు బహుమతులు, పట్టు చీరల ప్రదానం..

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు పటాన్‌చెరులో అంబరాన్నంటాయి. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే తెలంగాణ ఆడపడుచుల అపురూప పండుగకు సాకి చెరువు కట్ట వేదికగా నిలిచింది. పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన బతుకమ్మ సంబరాలు పూల సోయగాలు, జానపద గీతాలు, మహిళల కోలాహలం మధ్య కన్నుల పండువగా సాగాయి. వేలాదిమంది మహిళలు రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను తీసుకొని తరలిరావడంతో సాకి చెరువు కట్ట తెలంగాణ సంస్కృతి వైభవానికి నిలువుటద్దంగా మారింది.

సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన వేడుకలు రాత్రి 11 గంటల వరకు ఆరు గంటలపాటు నిర్విరామంగా కొనసాగాయి. ప్రముఖ జానపద, సంగీత గాయకుల బృందాలు ఆలపించిన బతుకమ్మ పాటలకు మహిళలు లయబద్ధంగా నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు. సంప్రదాయ పూల పండుగకు ఆధునిక సాంస్కృతిక హంగులు తోడవడంతో వేడుకల ప్రాంగణం ఆనందోత్సాహాలతో నిండిపోయింది.

ప్రకృతిని పూజించే అపురూప పండుగ బతుకమ్మ

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధానికి, మన సంస్కృతి సంప్రదాయాల గొప్పతనానికి బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, ఆదరణ, సహకారంతో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడం తనకు ఎంతో గర్వకారణమని తెలిపారు. ముఖ్యంగా పటాన్చెరు పట్టణ ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలను జీవితాంతం మరువలేనని, ప్రజలకు తమ కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని భావోద్వేగంగా పేర్కొన్నారు.గత 15 సంవత్సరాలుగా బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తూ ప్రజల సంతోషాల్లో భాగస్వాములవుతున్నామని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే సంకల్పంతో ఇలాంటి వేడుకలను కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

రచ్చ రవి బృందం ప్రదర్శనలతో సందడే సందడి

ప్రముఖ నటుడు, హాస్య కళాకారుడు రచ్చ రవి నేతృత్వంలోని బృందం నిర్వహించిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వినోదభరిత ప్రదర్శనలు, కళాకారుల సందడి ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. కాజిపల్లి భరత్ అధ్వర్యంలో బతుకమ్మ పాటలు, జానపద సంగీతం, కళాకారుల ప్రదర్శనలతో సాకి చెరువు పరిసరాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

విజేతలకు రూ.50 వేల నగదు బహుమతులు.. పట్టు చీరల పంపిణీ

సంప్రదాయబద్ధంగా, సృజనాత్మకంగా బతుకమ్మలను అలంకరించి తీసుకొచ్చిన మహిళలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఉత్తమ బతుకమ్మల పోటీలు నిర్వహించారు. విజేతలకు మొత్తం రూ.50 వేల నగదు బహుమతులతో పాటు పట్టు చీరలను అందజేశారు.

– ప్రథమ బహుమతి: రూ.20,000 నగదు, పట్టు చీర.
– ద్వితీయ బహుమతి: రూ.15,000 నగదు, పట్టు చీర.
– తృతీయ బహుమతి: రూ.10,000 నగదు, పట్టు చీర.
– 15 మంది మహిళలకు: కన్సోలేషన్ బహుమతులతో పాటు పట్టు చీరలు.

విజేతలకు బహుమతులు అందజేయడంతో మహిళల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. బతుకమ్మ పండుగలో మహిళల భాగస్వామ్యాన్ని, సంప్రదాయ కళల పట్ల వారికున్న ఆసక్తిని ప్రోత్సహించేలా ఈ కార్యక్రమం సాగింది.

మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు

వేడుకల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, ఆయన కుమార్తె, కోడలు, మనుమరాళ్లు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు సైతం సంప్రదాయ వేడుకల్లో భాగస్వాములు కావడంతో మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.

తెలంగాణ సంస్కృతికి సాకి చెరువు కట్ట వేదిక

పూల పరిమళాలు, బతుకమ్మ పాటల మాధుర్యం, మహిళల సంప్రదాయ నృత్యాలు, జానపద కళాకారుల ప్రదర్శనలతో సాకి చెరువు కట్ట పండుగ శోభను సంతరించుకుంది. పటాన్చెరు పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, మహిళలు, ఇతర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.సద్దుల బతుకమ్మ వేడుకలతో పటాన్చెరు మరోసారి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పింది. ప్రజలతో మమేకమవుతూ, వారి ఆనందాల్లో భాగస్వాములవుతూ నిర్వహించిన ఈ పూల పండుగ సాకి చెరువు కట్టపై చిరస్మరణీయమైన సంబరంగా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *