– త్వరలో పటాన్‌చెరులో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహిద్దాం: కే. విరహత్ అలీ
-విరాహత్ ఆలిని మర్యాదపూర్వకంగా కలిసిన పటాన్‌చెరు నూతన కార్యవర్గం
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
టీయూడబ్ల్యూజే-ఐజేయూ పటాన్‌చెరు నియోజకవర్గ నూతన కార్యవర్గం ఎన్నికైన సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కే. విరహత్ అలీని గురువారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని యూనియన్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి అధ్యక్షతన, పటాన్‌చెరు నియోజకవర్గ అధ్యక్షుడు పత్తి నరసింహ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కే. విరహత్ అలీ మాట్లాడుతూ పటాన్‌చెరు నియోజకవర్గంలో ఇటీవల నిర్వహించిన జర్నలిస్టుల సమావేశం కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమై రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని ప్రశంసించారు. సంఘం పట్ల జర్నలిస్టుల్లో విశ్వాసాన్ని పెంపొందించేలా కార్యవర్గం పనిచేసిందని కొనియాడారు.

టీయూడబ్ల్యూజే-ఐజేయూ సంఘానికి 75 ఏళ్ల ఘన చరిత్ర ఉందని పేర్కొన్న ఆయన, క్రమశిక్షణకు మారుపేరైన ఈ సంఘంలో ప్రతి జర్నలిస్టు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పదవి అనేది అధికారం కాదని, అది ఒక బాధ్యత మాత్రమేనని అన్నారు. అహంకారానికి దూరంగా ఉండి సేవాభావంతో పనిచేసినప్పుడే పదవికి గౌరవం లభిస్తుందని తెలిపారు.త్వరలో రాష్ట్రస్థాయి సమావేశాన్ని పటాన్‌చెరులో భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, అందుకు స్థానిక కార్యవర్గం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పటాన్‌చెరుకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఆ ప్రాంతం ప్రత్యేక అనుభూతి కలిగి ఉందని, ఆ ప్రాముఖ్యతను మరింత పెంచేలా నూతన కార్యవర్గం పనిచేయాలని సూచించారు.
సంఘాన్ని బలోపేతం చేయడంతో పాటు జర్నలిస్టుల హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేయాలని అన్నారు.యూనియన్ కోసం నిస్వార్థంగా కష్టపడే ప్రతి కార్యకర్తను నాయకత్వం గుర్తిస్తుందని, వారి సేవలను ఎల్లప్పుడూ గౌరవిస్తుందని విరహత్ అలీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రుమాండ్ల అనిల్, రాష్ట్ర కమిటీ నాయకులు అబ్దుల్ బాసిత్, జిల్లా ఉపాధ్యక్షుడు పర్చ శ్రీనాథ్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి బసవేశ్వర్, సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ భూపాల్ రెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి యాదగిరి, ఉపాధ్యక్షులు శివకుమార్, కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి, కమిటీ సభ్యులు శేఖర్, పురుషోత్తం, శ్రీనివాస్, సిద్ధు తదితరులు పాల్గొన్నారు.
